బనకచర్ల సంగతేంది..వివరాలున్నా ఎందుకు దాస్తుండ్రు: జీఆర్ఎంబీని ప్రశ్నించిన తెలంగాణ

బనకచర్ల సంగతేంది..వివరాలున్నా ఎందుకు దాస్తుండ్రు: జీఆర్ఎంబీని ప్రశ్నించిన తెలంగాణ
  • 5 నెలల క్రితం కేంద్రం నుంచి లేఖ వచ్చినా చెప్తలేరెందుకు
  • అన్ని విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదు: జీఆర్ఎంబీ
  • ఇన్ పుట్స్ ఇవ్వకుండా పనులు చేస్తాంటే కుదరదన్న తెలంగాణ
  • వాడీ వేడిగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం
  • బోర్డు తీరుపై తెలంగాణ అధికారులు అసహనం

హైదరాబాద్: గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు అంశం జీఆర్ఎంబీ మీటింగ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ  గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏకే ప్రధాన్‌ అధ్యక్షతన  జలసౌధలో జీఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన  బనకచర్ల ప్రాజెక్టును  తెలంగాణ ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది.  ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు గడిచాయని, కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదని అన్నారు. 

బనకచర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణపై ప్రభావం తదితర వివరాలు అందించాలని తెలంగాణ అధికారులు జీఆర్ఎంబీని కోరారు.  బనకచర్ల పై గతేడాది డిసెంబర్ 10న బోర్డుకు ఏపీ నుంచి సమాచారం వచ్చిందని, బోర్డుకు ఇన్  పుట్ ఉన్నా తమకు సమాచారం ఇవ్వలేదని  తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్టులపై ఇన్ పుట్స్ ఇవ్వకుండా పనులు చేస్తామంటే కుదరని తెలిపింది.  ఫ్లడ్ వాటర్ పేరుతో 40 వేల క్యూసెక్కులు తీసుకెళ్తామని అంటున్నారని, ఈ పేరుతో తెలంగాణ అలొకేటెడ్ వాటర్ తీసుకెళ్లే  ప్రమాదం ఉందని ఆరోపించారు.  

ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని..  డీపీఆర్ ఇంకా తయారు కాలేదని ఏపీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీఆర్‌ఎంబీ కార్యదర్శి అజగేషన్‌ వ్యవహార శైలిని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా జీఆర్‌ఎంబీలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులను అజగేషన్‌ వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

సమావేశంలో తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.