రాష్ట్ర ఆమ్దానీ పెంచుదాం: కొత్త ఆదాయ మార్గాలపై తెలంగాణ సర్కారు ఫోకస్

రాష్ట్ర ఆమ్దానీ పెంచుదాం: కొత్త ఆదాయ మార్గాలపై తెలంగాణ సర్కారు ఫోకస్
  • ప్రస్తుతం నెలకు వస్తున్నది రూ.18 వేల కోట్లలోపే
  • ఇందులో జీతాలు, కిస్తీలకే రూ.12 వేల కోట్లు
  • సంక్షేమ పథకాలకు నిధుల సమస్య
  • నెలకు రూ.25 వేల కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి
  • రాబడి పెంపు మార్గాలపై సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక 
  • ఎల్ఆర్ఎస్, 58, 59 జీవోల అప్లికేషన్ల క్లియరెన్స్, భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్లాన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆమ్దానీ పెంపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతినెలా ఖర్చులు పెరిగిపోవడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత  ఏర్పడుతుండటంతో ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి లోటు లేకుండా పకడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇప్పటికే ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు తెలిసింది. ప్రభుత్వానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో 60 శాతం పైగా నిధులు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు, గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలకు, వడ్డీలకే చెల్లిస్తున్నారు. 

ఇక గ్రీన్​చానెల్​లో ఉన్న ఆసరా పెన్షన్ల వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు ప్రతినెలా తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీపోనూ నెలాఖరుకు వచ్చేసరికి ఖజానా దాదాపు ఖాళీ అవుతున్నది. అందుకే ఆదాయం పెంచుకునేలా ఎల్ఆర్​ఎస్​కు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే జీవో 58, 59 పెండింగ్ అప్లికేషన్లపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతోపాటు గతేడాదిలోనే పెంచాలనుకున్న రిజిస్ట్రేషన్​చార్జీలు (భూముల విలువల సవరణ) రానున్న రెండు నెలల్లో పెంచేలా ప్లాన్ చేస్తున్నది. 

ఇక బీర్ల​ ధరలను కూడా ప్రభుత్వం ఇదివరకే పెంచింది. పడావుగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. వీటన్నింటి ద్వారా రాష్ట్ర రాబడిని వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలని భావిస్తోంది. త్వరలోనే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆదాయ పెంపుపై బడ్జెట్​లో స్పష్టమైన అంచనాలు కూడా రెడీ చేసినట్లు తెలిసింది.  

ప్రతి నెలా రూ. 25 వేల కోట్లు కావాలి.. 

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వివిధ రూపాల్లో సమకూరుతున్న ఆదాయం రూ.18 వేల కోట్లలోపే ఉన్నది. ఇందులో రాష్ట్ర సొంత రాబడులతో పాటు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, నాన్ ట్యాక్స్ ఆదాయం కూడా ఉన్నాయి. జీఎస్టీ నుంచి ప్రతినెలా సుమారు రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు వస్తోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల ఆదాయం రూ.1,100 కోట్లు, ఎక్సైజ్, వ్యాట్ నుంచి రూ.3 వేల కోట్లు, కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.1,500 కోట్లు, సేల్స్ ట్యాక్స్ కింద రూ.2,500 కోట్లు, అప్పులు రూ.4 వేల నుంచి రూ. 5 వేల కోట్లు, నాన్ ట్యాక్స్​తో పాటు ఇతర గ్రాంట్ల వంటివి కలిపి రూ.1,000 కోట్ల మేర వస్తున్నాయి. 

అయితే, అంతా కలిపినా ఈ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లు దాటలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతినెలా కనీసం రూ.25 వేల కోట్లు అవసరం. దీంతో వచ్చే ఆదాయంలో కనీసం ఇంకో రూ.7 వేల కోట్ల మేర పెరగాల్సి ఉన్నది. అందుకే లిక్కర్, రిజిస్ర్టేషన్లు, నాన్ ట్యాక్స్ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రూ.25 వేల కోట్ల మార్క్​ను రీచ్ కావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.  

నాలుగైదు మార్గాలపై కసరత్తు 

రాబడి పెంచుకునేందుకు నాలుగైదు మార్గాలను ప్రభుత్వం సిద్ధంగా పెట్టుకున్నది. ఇందులో మొదటిదైన ఎల్ఆర్ఎస్​ను పట్టాలు ఎక్కించింది. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్లియర్ చేయడం ద్వారా కనీసం రూ.15 వేల కోట్లు రాబట్టుకోవాలని చూస్తున్నది. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల శాఖ నుంచి ఇంకింత ఆదాయం వచ్చేందుకు భూముల విలువలను సవరించాలని చూస్తోంది. దీంతో రిజిస్ర్టేషన్ల చార్జీలు పెరగనున్నాయి. కొత్త చార్జీలను రానున్న రెండు నెలల్లోనే అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. 

ఇక 58, 59 జీవోల కింద వచ్చిన దరఖాస్తులలో అర్హమైన అప్లికేషన్లను పరిష్కరించాలని యోచిస్తోంది. దీంతోనూ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీర్ల ధరలను ప్రభుత్వం పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం, ఎలైట్ బార్లు, వైన్స్ లకు అనుమతులు ఇవ్వడం ద్వారా లిక్కర్ ఆదాయం కూడా అమాంతం పెంచాలని అనుకుంటున్నది. కనీసం నెలకు రూ. 4,500 కోట్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 

ప్రభుత్వ భూములను కూడా అమ్మాలని డిసైడ్ అయ్యారు. ఎక్కువ మొత్తంలో నిధులు సమకూర్చే భూములను గుర్తించారు. ఇందులో 400 ఎకరాల భూమిని డెవలప్ చేసి సేల్ చేసేందుకు ఇప్పటికే టీజీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇసుక అక్రమ రవాణాను తగ్గించి, ఇసుక ఆదాయం కూడా పెంచేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. 

రాబడిలో సగానికిపైగా జీతాలు, కిస్తీలకే.. 

రాష్ట్ర ఖజనాకు వస్తున్న రాబడిలో ఎక్కువ మొత్తం చెల్లింపులు ఉద్యోగుల జీతాలు వారి పెన్షన్లకు, గతంలో చేసిన అప్పుల కిస్తీలు, వాటి వడ్డీలకే పోతున్నది. పైగా గతేడాది నుంచే ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలవడంతో బెనిఫిట్స్​ భారం కూడా ప్రభుత్వంపై పడింది. జీతభత్యాలు, పెన్షన్ల కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.6 వేల కోట్లు చెల్లింపులు చేస్తున్నది. బెనిఫిట్స్ కూడా కలిపితే ఈ మొత్తం మరికొంత పెరుగుతోంది. వీటికి తోడు కిస్తీలు, వడ్డీల చెల్లింపులకు  ప్రభుత్వం ప్రతినెలా రూ.6,800 కోట్ల మేర చెల్లిస్తున్నది. 

ఏమి చేసినా, చేయకపోయినా వీటిని కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.13 వేల కోట్లు వీటికే కడుతున్నారు. ఇక మిగిలే రూ.5 వేల కోట్లలో ప్రతినెలా ఆసరా పెన్షన్లకు దాదాపు 1,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వ అత్యవసర నిధుల రిలీజ్​కు మరో రూ. వెయ్యి కోట్ల మేర పోతున్నది. ఇతర గ్రీన్​చానెల్ పథకాలకు కూడా కొంత మొత్తం చెల్లిస్తున్నారు. అన్నీ పోను ఉంటున్న రూ.2, 3 వేల కోట్లతో నిధుల సర్దుబాటు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 

దీంతో రైతు బీమా, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలకు ఫండ్స్ ఇవ్వలేని పరిస్థితి నెల కొన్నది. ఇక బడా కాంట్రాక్టర్లకు కొంత మొత్తంలో బిల్లులు చెల్లించడం తప్ప చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ పెండింగ్ లో పడుతున్నాయి.