- ఎలక్ట్రానిక్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో యాప్ లాంచ్
- టీ డయాగ్నస్టిక్స్ ద్వారా హెల్త్ చెకప్స్.. యాప్ లో డేటా అప్ లోడ్ప్ర
- తిరోజూ హైదరాబాద్ కమాండ్ సెంటర్లకు రిపోర్ట్
- రాబోయే రోజుల్లో ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య స్కూళ్లలోనూ అమలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ట్రైబల్ హాస్టల్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ హెల్త్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత కొన్నేండ్లుగా గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతుండడం, కొంతమంది పరిస్థితి విషమించి మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనలు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. ప్రభుత్వాలకు ఇవి పెద్ద సమస్యగా మారాయి. ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హాస్టల్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ కు టీ డయాగ్నస్టిక్స్ద్వారా హెల్త్ చెకప్స్ నిర్వహించి, ఆ డేటాను భద్రపరిచేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించగా.. ఈ నెల 4న మంత్రి సీతక్క లాంచ్ చేశారు. అందులో స్టూడెంట్ హెల్త్ కు సంబంధించిన వివరాలను భద్రపరచనున్నారు.
ప్రతిరోజూ రిపోర్ట్
రాష్ట్రంలో ట్రైబల్ గురుకులాలు 155 ఉండగా.. ఇందులో సుమారు 72 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 450 ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ ఎస్ ) ఉన్నాయి. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ లో సుమారు 2.67 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. తొలి దశలో ట్రైబల్ గురుకులాల్లో యాప్ ను అమలు చేస్తుండగా.. రాబోయే రోజుల్లో ఆశ్రమ పాఠశాలలు, ఈఎంఆర్ఎస్ లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో ఉండే టీ డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో స్టూడెంట్స్ కు హెల్త్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్టూడెంట్ సిక్ ఉంటే ఆ సమాచారాన్ని పేరెంట్స్కు తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ 155 స్కూల్స్ లలో మొత్తం ఉన్న విద్యార్థుల సంఖ్య, ఎంతమంది స్కూల్ కు వచ్చారు, ఎంత మంది రాలేదు, హెల్త్ కారణాలతో ఎవరు సిక్ లీవ్ లో ఉన్నారు వంటి అంశాలను స్కూల్ లో ఉన్న స్టాఫ్ నర్స్.. యాప్ లో స్టూడెంట్ హెల్త్ రికార్డ్ పేరుతో అప్ లోడ్ చేస్తున్నారు. వీటిని వార్డెన్, ప్రిన్సిపాల్ అప్రూవ్ చేస్తే హైదరాబాద్ లో ట్రైబల్ సెక్రటరీ శరత్, ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మితోపాటు మరికొంత మంది ఉన్నతాధికారులకు యాప్ లో సమాచారం కనిపిస్తున్నది. ప్రతి స్టూడెంట్ కు ఇచ్చే డైట్, కాస్మోటిక్ చార్జీల ఐడీని దీనికి అనుసంధానం చేశారు. అదే విధంగా ప్రతి స్కూల్ కు ఒక కోడ్ ను ఏర్పాటు చేశారు.
ట్రైబల్ భవనంలో కమాండ్ సెంటర్
మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లో ఎస్టీ గురుకుల కేంద్ర కార్యాలయం ఉంది. ఇందులో యాప్ పర్యవేక్షణకు గురుకుల హెల్త్ కమాండ్ సెంటర్ ( జీహెచ్ సీసీ ) ను ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు పనిచేస్తుంది. ఇందులో ఒక డాక్టర్ తో ఐటీ బ్యాక్ గ్రౌండ్, యాప్ పర్యవేక్షణకు సంబంధించి టెక్నికల్ నాలెడ్డ్ ఉన్న ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. నిత్యం యాప్ లో అప్ డేట్ అవుతున్న సమాచారం, రిజిస్టర్ మెయింటెనెన్స్, యాప్ లో అన్ని గురుకులాల్లో హెల్త్ సమాచారం సాయంత్రం 4 గంటల వరకు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. కాగా, ప్రతి స్కూల్ కు రెగ్యులర్ స్టాఫ్ నర్స్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒక్క స్కూల్ కు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే బాగుంటుందని, ఒకే నర్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలంటే ఇబ్బంది అవుతున్నదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ప్రభుత్వ హాస్పిటల్స్ , వెల్ నెస్ సెంటర్ల నుంచి ట్రైబల్స్ స్కూల్స్, హాస్టల్స్ కు జలుబు, దగ్గు, జ్వరం, కడుపు, తలనొప్పికి అవసరమైన మందులను సరఫరా చేసేందుకు హెల్త్ డిపార్ట్ మెంట్ తో ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.
ప్రతి మంగళవారం హెల్త్ క్లాస్
ట్రైబల్ స్కూల్ లో ప్రతి మంగళవారం ఒక గంటపాటు స్టూడెంట్స్ కు హెల్త్ క్లాస్ నిర్వహిస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, జలుబు, దగ్గు, వీక్ నెస్, వాంతులు, గొంతు నొప్పి, విరోచనాలు వంటివి వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే వివరాలను జిల్లాల్లో ఉండే డాక్టర్ల సహాయంతో టీచర్లు చెబుతున్నారు. హెల్త్ డిపార్ట్ మెంట్ తో చర్చించి స్టూడెంట్స్ కు మెడికల్ స్ర్కీనింగ్ టెస్ట్ లు నిర్వహించి, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు అందిస్తున్నారు. జిల్లా డాక్టర్లను స్కూల్స్ కు రప్పిస్తున్నారు. చలికాలం, ఎండాకాలం వచ్చే రోగాలతో పాటు బాలికలకు వచ్చే హెల్త్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే స్కూల్ వార్డెన్ కు, తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. స్కూల్ కు సమీపంలో ఉండే పీహెచ్ సీ లో ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు. ఒకవేళ రికవరీ కాకపోతే జిల్లా ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు.
అన్ని గురుకులాల్లో హెల్త్ యాప్ తీసుకొస్తం-మంత్రి సీతక్క
గత పదేండ్లు గురుకులాలు, గిరిజన ఆశ్రమాలను, అందించే ఆహారాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. పిల్లల డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు మూడు రెట్లు పెంచాం. దీంతో పాటు నిరంతరం పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు హెల్త్ యాప్ ను అందుబాటులోకి తీసుకోచ్చాం. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలిసి ట్రీట్ మెంట్ అందిచేలా యాప్ ఉంది. సీఎం, మంత్రి, ట్రైబల్ సెక్రటరీ, ఎస్టీ గురుకుల సెక్రటరీలకు విషయం వెంటనే తెలిసేలా యాప్ రూపొందించాం. యాప్ పై సలహాలు, సూచనలు తీసుకుంటున్నం.. ఇంకా అప్ గ్రేడ్ చేస్తం. రానున్న రోజుల్లో బీసీ, ఎస్సీ గురుకులాల్లో కూడా ఈ యాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నం