
- రెండు దశాబ్దాల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్
- రూ. 3 కోట్ల నిధులతో స్పీడ్ గా అభివృద్ధి పనులు
వరంగల్, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేండ్ల స్వరాష్ట్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన వరంగల్ లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పూర్వ వైభవానికి ప్రస్తుత సర్కార్ చర్యలు తీసుకుంటోంది. రూ.3 కోట్ల నిధులతో పనులు చేపట్టగా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. 30 ఏండ్ల కింద భద్రకాళి ఆలయ చెరువు కట్టకు ఆనుకుని సువిశాల స్థలంలో పార్క్ ను నిర్మించారు. గ్రీనరీతో పాటు కలర్‍ఫుల్‍గా కనిపిండమే కాకుండా టూరిస్ట్ స్పాట్ గానూ నిలిచింది. సినిమా, టీవీ షూటింగ్ లతో పార్క్ సిటీకి ఐకాన్‍గా మారిపోయింది. కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్‍అథారిటీ ఆధ్వర్యంలో 1995లో ఏర్పాటైన మ్యూజికల్ గార్డెన్ దశాబ్దాలుగా ఆదరణ కోల్పోయింది.
కనీస మెయింటనెన్స్ లేక పార్కులోని వాటర్ ఫౌంటెన్లు, ఆట వస్తువులు, సందర్శకుల కుర్చీలు తుప్పుపట్టి విరిగిపోయాయి. కళావిహీనంగా తయారై పిచ్చి చెట్లతో అడవిలా మారిపోయింది. స్థానికులు చెత్తను కూడా వేయడంతో డంపింగ్ యార్డైంది. సమైక్య రాష్ట్రంలో పార్కు అభివృద్ధికి నోచుకోవడంలేదని తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‍ఎస్ నేతలు ఆరోపిస్తూ.. ప్రత్యేక రాష్ట్రంలో సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం వరంగల్ ను స్మార్ట్ సిటీగానూ ఎంపిక చేసి.. అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించింది. అప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు చేయలేదు. అసలే పార్కును పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మ్యూజికల్ గార్డెన్ పార్క్ పూర్వ వైభవానికి కృషి చేస్తోంది. సుమారు 20 ఏండ్లుగా ఆదరణ కోల్పోయిన పార్క్ ను మళ్లీ సుందరంగా తీర్చిదిద్దుతుండగా వచ్చే ఏప్రిల్ లో ఓపెనింగ్ కు సిద్ధమవుతోంది.