
హైదరాబాద్, వెలుగు: భూదాన్ భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయనే అభియోగాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుంత్వం హైకోర్టుకు తెలిపింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, రఘునందన్‌రావు, శశాంక్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెం.181,182లో 103.22 ఎకరాల భూదాన్ భూముల అక్రమాలపై కూడా అదే కమిటీ విచారిస్తున్నదన్నారు.
నాగారంలో 50 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేసిన వ్యవహారంపై ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వం గడువు కోరడంతో విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.