బదిలీలకు గ్రీన్​ సిగ్నల్.. జూలై 5 నుంచి 20 వరకు షెడ్యూల్​

బదిలీలకు గ్రీన్​ సిగ్నల్.. జూలై 5 నుంచి 20 వరకు షెడ్యూల్​
  • నాలుగేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న 
  • ఎంప్లాయిస్​కు తప్పనిసరి బదిలీ
  • వితంతువులు, స్పౌజ్, అనారోగ్యంతో 
  • బాధపడుతున్న వారికి ప్రయారిటీ
  • ఐదేండ్ల తర్వాత బదిలీలపై నిషేధం 
  • ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్​, వెలుగు: ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దాదాపు ఐదేండ్ల తరువాత బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ స్పెషల్​ సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5 నుంచి జులై 20 వరకు బదిలీలకు షెడ్యూల్​ ప్రకటించారు. ఒకే చోట నాలుగేండ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. 

కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేయనున్న ప్రభుత్వం.. వితంతువులు, స్పౌజ్, కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యమివ్వనున్నది.  బదిలీలకు అవకాశం ఇవ్వాలని కొంత కాలంగా  ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో 80 విడుదల చేసింది. బదిలీలకు విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేండ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. 

రెండేండ్లు కూడా పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదని పేర్కొన్నారు.  వచ్చే ఏడాది జూన్ 30లోగా ఉద్యోగ విరమణ చేసే వారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవు. ఒకే కేడర్​లో 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల్లో పలు కేటగిరీలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. 

స్పౌజ్, వితంతువు, ఏడాది లోపు రిటైర్ అయ్యే వారు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఎముకల టీబీ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. ప్రస్తుతం అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ప్రాధాన్యత స్థానాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. 

వెబ్​కౌన్సెలింగ్ ​ద్వారా ఆప్షన్లు

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి, బదిలీలు చేయనున్నారు. జులై 5 నుంచి 8 వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. జులై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. జులై 13 నుంచి 18 వరకు బదిలీల దరఖాస్తులను పరిశీలించి, జులై 19, 20వ తేదీల్లో బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. జులై 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు.

సీఎంకు టీజీఓ, టీఎన్జీఓ సంఘాల కృతజ్ఞతలు

ప్రస్తుత స్టేషన్​లో రెండేండ్ల  సర్వీసును పూర్తి చేసుకున్నవారిని బదిలీకి  అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేయడంపై తెలంగాణ గెజిటెడ్  అధికారుల  కేంద్ర,  సంఘ  రాష్ట్ర  అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, ప్రధాన  కార్యదర్శి  ఏ సత్యనారాయణ రాష్ట్ర  ప్రభుత్వానికి  ఒక ప్రకటనలో కృతజ్ఞతలు  తెలిపారు.  ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇచ్చినందుకు సీఎం రేవంత్​ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి  టీఎన్జీవో సంఘం ధన్యవాదాలు తెలిపింది. 2018 నుంచి  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియను చేపట్టడం కోసం ఉత్తర్వులు ఇచ్చినందుకు టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్,   ప్రధాన కార్యదర్శి ముజీబ్​ కృతజ్ఞతలు తెలియజేశారు.