పాలేరులోకి మున్నేరు వరద .. 9.6 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్​

పాలేరులోకి మున్నేరు వరద .. 9.6 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్​
  • పాత డిజైన్​ ప్రకారమే మున్నేరు రిటైనింగ్ వాల్ 

ఖమ్మం, వెలుగు: పాలేరు రిజర్వాయర్​కు నాగార్జున సాగర్​ నీటితో సంబంధం లేకుండా ప్రత్నామ్నాయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. అతి తక్కువ ఖర్చుతో మున్నేరు వరద నీటిని పాలేరు రిజర్వాయర్ కు మళ్లించే లింక్​ కెనాల్​కు ఓకే చెప్పింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా మీదుగా వచ్చే మున్నేరు నది ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది. మార్గమధ్యలో మున్నేరులో ఆకేరు, బిక్కేరు కలుస్తుండగా, ప్రతియేటా మున్నేరు ద్వారా 30 నుంచి 40  టీఎంసీల వరద నీరు సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం సీతారామ కాల్వల నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో పాటు, ప్రతిసారి ఎత్తిపోతలకు విద్యుత్​ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మున్నేరు నీటిని పాలేరు రిజర్వాయర్​ కు తరలించేలా ప్లాన్​ చేశారు.

 ఈ గ్రావిటీ కాల్వ నిర్మాణానికి రూ.110 కోట్లు ఖర్చు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు 200 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుందని, ల్యాండ్ అక్విజేషన్​ కు రూ.30 కోట్లు ఖర్చవుతాయని చెబుతున్నారు. మొత్తం రూ.140 కోట్ల అంచనా వ్యయంతో 9.6 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వ తవ్వడం ద్వారా మున్నేరు నీటిని ప్రస్తుతం నిర్మాణమవుతున్న పాలేరు ట్రంక్​ కెనాల్​ కు తరలించే విధంగా ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. దీన్ని ఈ ఏడాది ఆగస్టు 15న వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అదే బహిరంగ సభలో కొరివి వీరన్న పేరుతో రిజర్వాయర్​ ను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. 

ప్రస్తుతానికి రిజర్వాయర్​ పై నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉండగా, గ్రావిటీ కెనాల్ కు గ్రీన్​ సిగ్నల్ వచ్చింది. మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం మద్దివంచ హామ్లెట్ గ్రామం దుబ్బగూడెం దగ్గర మున్నేరుపై చెక్​ డ్యామ్​ ఉంది. అక్కడి నుంచి 9.6 కిలోమీటర్ల దూరంలోని గార్ల దగ్గర పాలేరు లింక్​ కెనాల్​ బెడ్​ లెవల్​ నాలుగు మీటర్ల దిగువన ఉంది. దీంతో గ్రావిటీ ద్వారానే పాలేరు కాల్వలోకి మున్నేరు నీటిని తరలించొచ్చు. దీని ద్వారా సాగర్​ నీటిపై ఆధారపడకుండానే ఖమ్మం జిల్లాలోని ​దాదాపు 3 లక్షల ఎకరాల సాగర్​ ఆయకట్టును స్థిరీకరించవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంతో పాటు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరనుంది.

పాత డిజైన్​ ప్రకారమే రిటైనింగ్ వాల్!

మున్నేరు వరద నీరు జనావాసాల్లోకి, లోతట్టు కాలనీల్లోకి రాకుండా ప్లాన్​ చేసిన ఆర్​సీసీ రిటైనింగ్ వాల్ ను పాత డిజైన్​ ప్రకారమే నిర్మించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సెప్టెంబర్​ లో దాదాపు 40 అడుగుల మేర మున్నేరు ప్రవహిస్తూ, దాదాపు 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో మున్నేరుకు రెండు వైపులా ఉన్న 30కి పైగా కాలనీలు జలమయమయ్యాయి. తాజా వరదలను దృష్టిలో పెట్టుకొని రిటైనింగ్ వాల్ ను రీ డిజైన్​ చేయాలని ప్లాన్​ చేశారు. అయితే ప్రకాశ్​ నగర్​ దగ్గర ఉన్న చెక్ డ్యామ్​  ను తొలగించి, పాత డిజైన్​ ప్రకారమే రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిసైడ్​ అయినట్టు సమాచారం. 

పాత ప్లాన్​ ప్రకారం ప్రకాశ్​ నగర్ దగ్గర నుంచి గోళ్లపాడు వరకు 8.5 కిలోమీటర్ల చొప్పున రెండు వైపులా కలిపి 17 కి. మీఆర్సీసీ వాల్ నిర్మించనున్నారు. మున్నేరు మధ్యభాగం నుంచి రెండు వైపులా 115 మీటర్ల చొప్పున దూరం ఉంటూ, కనీస ఎత్తు 6 మీటర్ల నుంచి గరిష్ఠంగా 11 మీటర్ల వరకు లో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ కు దిగువన ధంసలాపురం దగ్గర రెయిన్ వాటర్, డ్రెయిన్ వాటర్ మున్నేరులో కలిసేలా డిజైన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే దీనికి రూ.690.52 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఎండాకాలంలోనే దానవాయిగూడెం సమీపంలో కాంక్రీట్ బెడ్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇటీవల వరదల తర్వాత పనులకు బ్రేక్​ పడగా,  ఇప్పుడు ఆఫీసర్లకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి స్పష్టమైన ఆదేశాలివ్వడంతో రిటైనింగ్ వాల్ పనులు ఇక స్పీడందుకునే అవకాశముంది.