టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్: టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి 2025, జనవరి 29న ఆదేశాలు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు మొత్తం 38 వర్కింగ్ డేస్ స్నాక్స్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025, మార్చి 21వ తేదీ నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, మార్చి 26న మ్యాథ్స్, మార్చి 28న ఫిజిక్స్, మార్చి 29న బయోలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరగనున్నాయి.పదో తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల విధానంతో పాటు గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పింది. 

ఇక నుంచి వంద మార్కులకూ పరీక్షలు నిర్వహించనున్నది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. రాష్ట్రంలో టెన్త్ క్లాసులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులుండగా, సైన్స్లో మాత్రమే బయోలజీ, ఫిజిక్స్ రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ ఒక్కో సబ్జెక్టుకు వంద మార్కులు ఉండగా, దాంట్లో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తుండగా, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉండేవి.

ఈ విధానాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ఇక నుంచి వంద మార్కులకూ రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 2014 నుంచి పరీక్షల్లో సీసీఈ విధానం అమలు చేస్తున్నారు. దీంతో మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పరీక్షల విధానం తొలగించి, ఫార్మటీవ్ అసెస్మెంట్–ఎఫ్​ఏ, సమ్మెటీవ్ అసెస్ మెంట్–ఎస్​ఏ విధానం అమలు చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే 2015 నుంచి టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏటా జరిగే నాలుగు ఎఫ్ఏల్లో వచ్చే మార్కుల ఆధారంగా 20 ఇంటర్నల్ మార్కులను టీచర్లు కేటాయించేవారు. రాత పరీక్ష ద్వారా 80 మార్కులు ఉండేవి. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటర్నల్ మార్కుల విధానానికి బ్రేక్ పడినట్టైంది.