హైదరాబాద్, వెలుగు: టెట్ అభ్యర్థులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకున్నది. గత మేలో నిర్వహించిన టెట్‌కు దరఖాస్తు చేసుకున్నోళ్లందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మరోవైపు గత మేలో పెంచిన టెట్ ఫీజులను ఈసారి భారీగా తగ్గించింది. గతంలో ఒక పేపర్‌కు రూ.వెయ్యి, రెండు పేపర్లు రాస్తే రూ.2 వేల ఫీజు ఉండగా.. ప్రస్తుతం దాన్ని ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యిగా నిర్ణయించింది. ఈ మేరకు టెట్ డిటెయిల్డ్ నోటిఫికేషన్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, టెట్ కన్వీనర్ రమేశ్ గురువారం రిలీజ్ చేశారు. మేలో నిర్వహించిన టెట్‌లో క్వాలిఫై అయినా, కాకపోయినా అప్లై చేసుకున్నోళ్లంతా.. వచ్చే జనవరిలో జరిగే టెట్ కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.
మొదలైన దరఖాస్తుల ప్రక్రియ..
టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచి 20 వరకు ఫీజు చెల్లించి https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ద్వారా అప్లై చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు రిలీజ్ చేస్తారు.
8 భాషల్లో పరీక్ష..
ఐదో తరగతి వరకు టీచర్‌గా ఉండాలనుకునేవారు పేపర్ -1, ఆరు నుంచి 8వ తరగతి వరకు టీచర్‌గా ఉండాలనుకునేవారు పేపర్-2కు అప్లై చేసుకోవచ్చు. టెట్ క్వశ్చన్ పేపర్ రెండు భాషల్లో ఉంటుంది. ఇంగ్లిష్తో పాటు ఇతర 8 భాషల్లో ఏదైనా అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు.
- టెట్ (మొత్తం
- క్వాలిఫై ఇలా.. 150 మార్కులు)
- కేటగిరీ మార్కులు
- జనరల్ 60%
- బీసీ 50%
- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ 40%
హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు
- టెట్ ఆఫీస్: 70750 88812 / 70750 28881
- వెబ్ సైట్ రిలేటెడ్: 70750 28882/ 70750 28885
- టెక్నికల్ రిలేటెడ్: 70329 01383/ 90007 56178