
హైదరాబాద్, వెలుగు: ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. బకాయిల చెల్లింపు కోసం తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఈ నెల 24న విచారిస్తామని, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. బకాయిల చెల్లింపు విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగిసిందని, తిరిగి అదే తరహా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ల డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. కాగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ప్రభుత్వం సరఫరా చేసిన విద్యుత్‌కు గాను తెలంగాణ ప్రభుత్వం రూ.6,756.92 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో పేర్కొంది.