హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 3,035 పోస్టుల్లో 2 వేల డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్(సివిల్), 7 మెడికల్ ఆఫీసర్(జనరల్), 7 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) కొలువులు ఉన్నాయి.
ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3,035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్ ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, అయితే తమ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోందని అన్నారు.
ఈ కొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3,035 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
12 ఏండ్ల తర్వాత రిక్రూట్‌మెంట్
ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తిస్తూ సంస్థలో 3,035 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపింది.
సంస్థలో 2012 నుంచి ఇప్పటివరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జరగలేదని.. 12 ఏండ్ల తర్వాత నియామక ప్రక్రియ జరుగబోతుందని తెలిపింది. కొత్త జాబ్స్‌తో ప్రజలకు వేగవంతమైన సేవలను అందించడంతో పాటు మహాలక్ష్మి పథకం మరింత సమర్థవంతగా అమలయ్యేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది.