హైదరాబాద్, వెలుగు: తహసీల్దార్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారు సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పిచాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) చేస్తున్న కృషి ఫలించింది. ఈ విషయమై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎన్ఏ నవీన్ మిట్టల్‌కు పలు మార్లు టీజీటీఏ నేతలు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో బదిలీలకు సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిందిగా తహసీల్దార్లకు అవకాశం ఇస్తూ సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల టీజీటీఏ రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
అందరికీ అవకాశం కల్పించేందుకు కృషి
అర్హత, ఆసక్తి, అవకాశం ఉన్న ప్రతి తహసీల్దార్‌కు బదిలీకి అవకాశం కల్పించాలని టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్ కోరారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి తహసీల్దార్‌కు సొంత జిల్లాలకు వెళ్లే విధంగా చాన్స్ కల్పించాలన్నారు.