ఇంటర్​లో ఇంటర్నల్​కు సర్కారు నో .. ఇంటర్ బోర్డు ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం

ఇంటర్​లో ఇంటర్నల్​కు సర్కారు నో .. ఇంటర్ బోర్డు ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం
  • సిలబస్ తగ్గింపుపైనా వెనక్కి.. త్వరలోనే కమిటీ 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ లో ‘ఇంటర్నల్’ మార్కుల విధానం ప్రవేశపెట్టాలన్న ఇంటర్ బోర్డు నిర్ణయానికి సర్కారు బ్రేక్ వేసింది. ఇంటర్నల్ విధానం అమలు చేయొద్దని స్పష్టం చేసింది. దీనికితోడు సిలబస్ తగ్గింపు,ఇతర మార్పులకూ సర్కారు అనుమతి ఇవ్వలేదు. దీంతో వచ్చే ఏడాది ఇప్పుడున్న సిలబస్ తోనే పాతపద్ధతిలోనే పరీక్షలు జరగనున్నాయి. అయితే, భవిష్యత్​ లో పరీక్షల విధానంలో మార్పులు, సిలబస్ మార్పులపై ఓ  కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 

వీ6 వెలుగు’లో కథనంతో సర్కారు పెద్దల్లో చర్చ  

వచ్చే విద్యాసంవత్సరం(2025–26)లో ఆర్ట్స్, లాంగ్వేజీ సబ్జెక్టుల్లో ఇంటర్నల్ విధానం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఫస్టియర్ లో  80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు ఇంటర్నల్స్ కు కేటాయించాలని డిసైడ్ అయింది. దీనికితోడు పలు సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాలను ఆమోదించాలని ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రపోజల్స్ పంపించారు. ఈ క్రమంలోనే  ఇంటర్ బోర్డు తీసుకున్న వివాదస్పద నిర్ణయంపై ‘ఇంటర్ లో ఇంటర్నల్ లొల్లి’ హెడ్డింగ్ తో  ఈనెల 17 ‘వీ6 వెలుగు’లో కథనం  ప్రచురితమైంది. 

ఈ విద్యాసంవత్సరంలోనే టెన్త్ లో ఇంటర్నల్ మార్కులను తీసేయగా, ఇంటర్ బోర్డు మాత్రం ఈ విధానం తీసుకురావాలనే ఆలోచన చేయడంపై ఈ కథనంతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై సర్కారు పెద్దల్లో  చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఇంటర్నల్ మార్కుల విధానాన్ని, సిలబస్ లో మార్పుల అంశాన్ని పక్కన పెట్టాలని ఇంటర్ బోర్డు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

చర్చ లేకుండానే నిర్ణయాలా?

 ఇంటర్నల్ మార్కుల విధానం, సిలబస్​లో మార్పుల అంశాలు లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినవని..అలాంటి అంశంపై ఎలాంటి చర్చ లేకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటని ఇంటర్ బోర్డును సర్కారు పెద్దలు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇంటర్ లో సంస్కరణలపై వర్కింగ్ గ్రూప్ కమిటీని వేయాలని ఆదేశించింది.  ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది పాతపద్ధతిలోనే  ఫస్టియర్ పరీక్షలు ఉండనున్నాయి. అయితే, ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్​లో సంస్కరణ లపై వర్కింగ్ గ్రూప్ కమిటీ వేయా లని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. కమిటీ లో అధికారులతో పాటు విద్యావేత్తలు, సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ కమిటీ సిలబస్, పరీక్షల విధానంలో మార్పులపై సమగ్ర అధ్యయనం చేయను న్నది. కమిటీ రిపోర్టు ఆధారంగానే భవిష్యత్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.