
- త్వరలోనే సీఎంతో భూమి పూజకు సన్నాహాలు
- భవన నిర్మాణానికి రూ.23.78 కోట్లు మంజూరు
హైదరాబాద్, వెలుగు: భువనగిరి జిల్లా యాద్రాద్రిలోని టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే, స్కూల్ నిర్మాణానికి రూ.23.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధుల నుంచి రూ.18.78 కోట్లు, మిగిలిన రూ.5 కోట్ల యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ ఫండ్ (వైటీడీఏ) నుంచి కేటాయించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
ఆలయానికి 1,241 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో భాగంగా 15 ఎకరాలను వేద పాఠశాల కోసం కేటాయించి టెంపుల్ సిటీగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అన్ని హంగులు, వసతులతో ఈ పాఠశాలను నిర్మించనున్నారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాయగిరిలో వేదపాఠశాల నిర్మించాలని భావించింది. అందుకు ప్రణాళికలు సైతం రూపొందించింది.
ఆ బాధ్యతలను చిన్న జీయర్‌స్వామికి అప్పగించింది. ఆ తర్వాత కేసీఆర్, చిన్నజీయర్ స్వామికి మధ్య గ్యాప్ రావడంతో వేద పాఠశాల నిర్మాణం పెండింగ్‌లో పడింది. తర్వాత కేసీఆర్ ఈ పాఠశాల నిర్మాణపై ఆసక్తి చూపకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. మరోవైపు, యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మిస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఆధ్యాత్మికతో పాటు భక్తిభావం పెంపొందించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది.
సంస్కృతిక పాఠశాల సైతం..
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో సంస్కృతిక పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్‌ను సైతం టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాల వద్దనే ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. రెండు ఒకేచోట ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. వేద విద్య, సంస్కృతిక విద్యను ఏకకాలంలో నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని, రవాణాపరంగా ఇబ్బందులు రావని ఆలయ ఈవో భాస్కర్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.