- 25% పెనాల్టీ రెండు వాయిదాల్లో చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్
- ఈ నెలాఖరు వరకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను100 శాతం చెల్లించిన డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపులను ప్రకటించింది. డిఫాల్టర్లకు కొంత వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎంఆర్‌ను పూర్తిగా అప్పగించినా, చెల్లించాల్సిన 25% పెనాల్టీని రెండు వాయిదాలలో చెల్లించేందుకు అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం, మిల్లర్లు 25% పెనాల్టీలో సగం ముందుగానే చెల్లించాలి. మిగిలిన సగాన్ని 2024 డిసెంబర్ 31 నాటికి చెల్లించాలి. అదనంగా, వారి మిల్లింగ్ సామర్థ్యం ఆధారంగా 25% బ్యాంక్ గ్యారంటీ కానీ సెక్యూరిటీ డిపాజిట్ కానీ అందించాల్సి ఉంటుంది.
ఇందుకు అంగీకరించిన డిఫాల్ట్ మిల్లర్లకు 2024–-25 సీజన్ కోసం ధాన్యం కేటాయింపు పొందేందుకు సర్కారు వీలు కల్పించింది. బకాయిలు చెల్లించిన వారికి ఉపశమనం కోరుతూ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సడలింపులతో ధాన్యం మిల్లింగ్ కార్యకలాపాలను సులభతరం అవుతాయని, ప్రస్తుత సీజన్‌కు సకాలంలో సీఎంఆర్ సేకరణ జరిగేలా ఉంటుందని భావిస్తున్నారు. సడలింపుల అమలు, షరతుల వర్తింపుపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశాలిచ్చారు. మొదటి విడత చెల్లింపును నిర్ధారించడానికి అర్హత కలిగిన మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. డిఫాల్టర్ మిల్లర్ల అంగీకారంతో పాటు బ్యాంక్ గ్యారెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించిన తర్వాతే ధాన్యం కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.