
- కేంద్ర క్రీడా శాఖ మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో క్రీడాభివృద్ధికి సహకరించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, సహాయ మంత్రి రక్షా ఖడ్సేకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మాండవియా అధ్యక్షతన రెండు రోజుల పాటు కన్హా శాంతివనంలో జరిగిన చింతన్ శిబిర్–2025 శనివారం ముగిసింది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, 2036 గేమ్స్‌ను ఇండియాలో నిర్వహించాలనే ప్రతిపాదనతో పాటు అనేక అంశాలపై చర్చించారు. పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించడం, నాణ్యమైన కోచ్‌లను తయారు చేయడం, అథ్లెట్ల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా భవిష్యత్‌లో రాష్ట్రంలో చేపట్టబోయే క్రీడా కార్యక్రమాలకు కేంద్ర సహకారం ఉండాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి కోరారు. మెదక్ జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఎస్‌టీసీ అథ్లెటిక్స్ సెంటర్‌ను తిరిగి ప్రారంభించాలని రక్షా ఖడ్సేకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (స్పోర్ట్స్), తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్ ఏపీ జితేందర్ రెడ్డి. క్రీడాశాఖ సెక్రటరీ జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి రాష్ట్రానికి కావాల్సిన ప్రధాన అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.