హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు వేగం పుంజుకున్నాయి. బ్యాలెన్స్ ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేసి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాల్లో చివరి దశకు చేరుకున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read:-‘హైదరాబాద్ మనది.. హైడ్రా మనందరిదీ’
వీటిపై హౌసింగ్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ఫోకస్ పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఇండ్లను లబ్ధిదారులకు పంచితే ఇందిరమ్మ ఇండ్లపై కొంత భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్ లో ఉన్న ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తే, నియోజకవర్గాల వారీగా ఎంత మందికి ఇళ్లు లేవో క్లారిటీ వస్తుందని, దీంతో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించవచ్చని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.
కొల్లూరులో పనులు స్పీడప్
హైదరాబాద్ సిటీ శివారులో కొల్లూరులో భారీ ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం చేపట్టింది. సుమారు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి గత ఏడాది ఎన్నికల ముందు అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వీటిని లబ్ధిదారులకు అందజేసినా కరెంట్, నీటి సరఫరా అంశంలో జల మండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ మధ్య ఫండ్ల వివాదం నెలకొంది. దీంతో అక్కడ లబ్ధిదారులు ఉండడం లేదు.
నీటి, కరెంట్ సరఫరా కు రూ.60 కోట్లు చెల్లించాలని జల మండలి, విద్యుత్ శాఖ కోరడంతో ఇటీవల నిధులును జీహెచ్ఎంసీ చెల్లించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో చాలాకాలం ఇళ్ల నిర్మాణం పూర్తయి పబ్లిక్ ఉండకపో వడంతో తలుపులు, కిటికీలు, వైరింగ్‌ను దొంగలు దొంగిలించారు. దీంతో వీటి మరమ్మతులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు రాంపూర్, కుత్బుల్లాపూర్, పోచారం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా చివరి దశకు చేరుకున్న పనులు పూర్తిచేస్తున్నామని, వచ్చే 2 నెలల్లో పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
జగిత్యాలలో పనులు వేగవంతం
జగిత్యాల మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 4,520 ఇండ్లు మంజూరైన ఏకైక మున్సిపాలిటి ఇది. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తయినా నిధుల కొరతతో రెండేళ్లుగా నిలిచిన డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్, వాటర్ ట్యాంక్, వివిధ అభివృద్ధి పనులు, వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. వీటిలో 3722 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా మిగతా ఇళ్లు అప్పగించేందుకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకులు, కరెంట్ కనెక్షన్ తో పాటు మౌలిక వసతులు పూర్తిచేయాలని గతంలో లబ్ధిదారులు ఆందోళన చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వసతుల కల్పనకు రూ. 32 కోట్లు మంజూరు చేసింది. పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే దసరాకు లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా ఫండ్స్ రిలీజ్ చేశారు.
పదేండ్లుగా పెండింగ్ లో పనులు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరిగుట్ట వద్ద 2014 జనవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,160 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. రాజీవ్ గృహం కల్ప పథకం కింద 25 ఎకరాల్లో రూ.98.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. రూ.38 కోట్లు రిలీజ్ చేయగా దాదాపు 40 శాతం పనులు పూర్తి చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీవ్ గృహకల్ప పథకాన్ని రద్దు చేయడంతో 2014 సెప్టెంబరులో పనులు ఆపేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సుమారు రూ. 75 కోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేపించారు. పలుసార్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పరిశీలించారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read:-కబ్జాదారుల భరతం పడ్తం
మంత్రి ఉన్నా పనులు పెండింగ్
సూర్యాపేట జిల్లా కేసారం వద్ద నాలుగేండ్ల క్రితం రూ.25.44 కోట్లతో 480 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 60 శాతం పనులు పూర్తిచేయగా 40 శాతం పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు ఇచ్చారు. కానీ, ఇండ్లను అలాట్ చేయలేదు. దీంతో లబ్ధిదారుల నుంచి ఒత్తిడి రావడంతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వాటి పనులు జరుగుతున్నాయి. మరో 10 శాతం పనులు పూర్తయితే లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.