విద్యార్థికి స్కాలర్ షిప్ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం జరిమానా విధించింది. విద్యార్థి విషయంలో ప్రభుత్వానికి జరిమానా విధించడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే మీరే చదవండి.. తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు రూ.లక్ష ఫైన్ వేసింది. రెండు వారాల్లో ఆ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకపోతే రికవరీ కోసం కోర్టు రిజిస్ట్రీ తగిన నిర్ణయాలు తీసుకుంటుందని హెచ్చరించింది.
తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి.. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి (ఏఓవీఎన్) స్కీం కింద స్కాలర్ షిప్ కోసం 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే, విద్యార్థి తండ్రి ఏడాది ఆదాయం రూ.2 లక్షలు మించి ఉందన్న కారణంతో దరఖాస్తును తిరస్కరించారు. దీంతో విద్యార్థి తండ్రి గంటా వెంకట నరహరి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం.. పిటిషనర్‌కు రూ.10 లక్షల స్కాలర్ షిప్ ఇవ్వాలని 2023లో హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read : రైతును మోసం చేసిన పత్తి విత్తనాల కంపెనీ బేయర్‌కు భారీ జరిమానా
విద్యార్థి తండ్రి ఏడాది ఆదాయం ఎంతో మరోసారి తెలపాలని స్థానిక కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. పిటిషనర్ ఆదాయ వివరాలతో 161 రోజుల తర్వాత హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఆలస్యమైందన్న వాదనలతో ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ జేపీ పార్ధీ వాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి 161 రోజుల ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ విషయంలో హైకోర్టు హేతుబద్ధంగా ఇచ్చిన తీర్పులపై రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించవద్దన్న ఉద్దేశంతో ఈ జరిమానా విధిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు వారాల్లో జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను బెంచ్ కొట్టివేసింది.