హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర సర్వీస్ ఆఫీసర్ల (ఐఏఎస్, ఐపీఎస్) కేటాయింపుపై ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మాట మార్చేసిందని హైకోర్టులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి వాదించారు. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, మరో 15 మందిని కమిటీ ఏపీకి కేటాయించగా.. దానికి వ్యతిరేకంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్రం ఫైల్ చేసిన అప్పీళ్లపై మంగళవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందాల డివిజన్ బెంచ్ విచారణ కొనసాగించింది.
క్యాట్ ఆదేశాల్ని రద్దు చేస్తే పాలనపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న తెలంగాణ వాదనను సూర్యకరణ్‌రెడ్డి వ్యతిరేకించారు. అధికారులు కొద్ది మంది మారితే పాలనపై ప్రభావం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సిన్హా కమిటీ లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే సోమేశ్, ఇతరులను ఏపీకి కేటాయించిందన్నారు. కమిటీలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సభ్యుడిగా ఉన్నారని.. మహంతి తన కుమార్తె, అల్లుడికి ప్రయోజనం చేయడం కోసమే సీనియార్టీ లిస్ట్‌లో సోమేశ్ పేరును చేర్చలేదన్న వాదనను తోసిపుచ్చారు. ఇందుకు ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న కోర్టు.. విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.