
- రికార్డుల్లో ఎక్కడా అడవి అని లేదు.. హెచ్సీయూకు సంబంధం లేదని హైకోర్టూ చెప్పింది
- కంచ గచ్చిబౌలి ల్యాండ్స్‌పై సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
- 1975లోని పరిస్థితులు కూడా ఇప్పుడు అక్కడలేవు
- చిన్న నీటి కొలను, సహజ రాక్ ఫార్మేషన్స్ ను తొలగించం
- ఆ ఏరియాను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
- కేటాయింపులు, కోర్టుల తీర్పులు, కేబినెట్ నిర్ణయాలు ప్రస్తావన
- ఫేక్ వీడియోలు, ఫేక్ ఫొటోలతో తప్పుడు ప్రచారంపై వివరాలు అందజేత
- కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను పరిశీలించిన కమిటీ
- విద్యార్థులు, హెచ్‌సీయూ పాలకవర్గంతోనూ సమావేశం
- వివిధ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీసుకున్న కమిటీ
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలు అటవీ భూమి కాదని, అందులో ఎలాంటి అడవి లేదని, అది పూర్తిగా ప్రభుత్వ భూమేనని రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. ఆ భూమితో అటు అటవీ శాఖకు, ఇటు హెచ్సీయూకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. 1975లో అదే సర్వే నంబర్ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మొత్తం 2,324.05 ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం కేటాయించిందని.. అప్పటికే రికార్డుల్లో ‘కంచ అస్తాబల్ పోరంబోక్’ అని నమోదై ఉందని, దీని అర్థం ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమి అని, అంతే తప్ప అడవి కాదని వివరించింది. అటవీ శాఖ రికార్డుల్లో కూడా దీనిని అడవిగా చూపలేదని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలిలోని భూములను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ కమిటీ గురువారం పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సీపీ గోయల్, సునీల్ లిమాయే, చంద్రదత్ గంటపాటు 400 ఎకరాల స్థలంలో కలియ తిరిగి అక్కడి పరిస్థితులను రికార్డు చేశారు.
హెచ్‌సీయూ విద్యార్థులతో కమిటీ సమావేశమైంది. పరిస్థితులను వివరిస్తూ రూపొందించిన నివేదికను కమిటీకి విద్యార్థులు అందజేశారు. కంచ గచ్చిబౌలి భూముల పరిశీలన అనంతరం కమిటీ తాజ్‌కృష్ణా హోటల్‌కు చేరుకుంది. అక్కడ సీఎస్ శాంతికుమారి, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్, సీఎంవో కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జలమండలి ఎండీ, టీజీఐఐసీ ఎండీతో సమావేశమైంది. కంచ గచ్చిబౌలి భూములపై చర్చించింది. కంచ గచ్చిబౌలి భూములపై కమిటీకి ప్రభుత్వ అధికారులు నివేదిక సమర్పించారు. ఇందులో సర్వే నంబర్ 25లో ఉన్న భూముల వివరాలు, కేటాయింపులు, జరిగిన ఒప్పందాలు, వాటి రద్దు, హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులతోపాటు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, వాటికి తగ్గట్టు ఆ 400 ఎకరాలలో చేపట్టిన పనులపై సమగ్రంగా రిపోర్ట్ అందజేశారు. అటవీ శాఖ అధికారులు కూడా ఇదే విషయాన్ని కమిటీకి నివేదించారు. హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనపై మంత్రుల కమిటీని కూడా వేశామని.. అన్నింటినీ పరిష్కరిస్తున్నామని సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి ప్రభుత్వం తెలిపింది.
ఆ భూమి బదలాయింపులు ఇట్లా జరిగినయ్..
సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి ఇచ్చిన నివేదికలో భూ బదలాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా వివరణ ఇచ్చింది. ఒకవేళ అది ప్రభుత్వ భూమి కాకుండా అటవీ భూమి అయి ఉంటే అసలు హెచ్సీయూకు కేటాయించడం సాధ్యమయ్యేది కాదని, అప్పుడే ఈ విషయం ప్రస్తావనకు వచ్చేదని రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి వివరించింది. ‘‘తర్వాత 2003లో ఐంఎజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నాటి ప్రభుత్వం సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీయూ నుంచి మొత్తం 534.28 ఎకరాలు తీసుకున్నది. ఇందుకు బదులుగా ప్రభుత్వానికి చెందిన 397 ఎకరాలను పక్కనే ఉన్న గోపన్‌పల్లి సర్వే నంబర్ 36లో ఇచ్చింది. ఈ వ్యవహారమంతా హెచ్‌సీయూ అంగీకారంతో, వారి సమక్షంలోనే జరిగింది. ప్రభుత్వం హెచ్‌సీయూ నుంచి తీసుకున్న 534.28 ఎకరాలలో 400 ఎకరాలు ఐంఎజీ భారతకు, ఇంకో 134.28 ఎకరాలు టీజీ ఎన్జీవోలకు ఇచ్చారు. అటవీ భూమి అయితే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం కుదిరే పని కాదు.. అప్పుడు కూడా ఎలాంటి అటవీ అంశం చర్చకు రాలేదు’’ అని రిపోర్టులో స్పష్టంచేసింది. 2006లో ఐఎంజీ భారత కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత.. ఆ కంపెనీ కోర్టులకు వెళ్లిందని.. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందినదని స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి రాష్ట్ర సర్కార్ వివరించింది. ఆ తీర్పు కాపీలనూ కమిటీ ముందు పెట్టింది. కేసుల సమయంలోనూ హెచ్‌సీయూ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదని కమిటీకి సర్కారు స్పష్టం చేసింది. 2017లో ఈ భూమిపై హెచ్సీయూకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు తేల్చిచెప్పిందని పేర్కొంది. 2017 జనవరి 2న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిలోంచి టీజీ ఎన్జీఓస్కాలనీ వరకు రోడ్డు వేసేందుకు ఒక మెమో జారీ చేశారని.. ఈ మెమోను హైకోర్టులో హెచ్‌సీయూలో సవాల్ చేయగా.. యూనివర్సిటీకి భూమిపై ఎలాంటి హక్కు లేదని కోర్టు తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం తెలిపింది. హెచ్సీయూకు భూబదాలయింపు చేసిన టైమ్‌లో ఎలాంటి వాతావరణం అక్కడ ఉందో.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కూడా ఆ 400 ఎకరాల్లో లేవని కమిటీకి రాష్ట్ర సర్కార్ నివేదించింది.
వర్సిటీకి కేటాయించిన భూములను రిజిస్ట్రేషన్ చేయాలి: వీసీ
అంతకుముందు హెచ్‌సీయూ పాలకవర్గంతో సుప్రీంకోర్టు ఎంపవర్డ్కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజేరావు ద్వారా వర్సిటీ ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు, ఎంవోయూలు, కోర్టు తీర్పులకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది. గత నెల 20న జరిగిన హెచ్‌సీయూ ఈసీ సమావేశంలో తీసుకున్న తీర్మానం కాపీని కమిటీకి వీసీ అందజేశారు. వర్సిటీకి కేటాయించిన ల్యాండ్‌ను యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని కోరుతున్నామని వివరించారు. అనంతరం సెంట్రల్ వర్సిటీ విద్యార్థి సంఘం ప్రతినిధులు, జేఏసీ నేతలు, ఫ్యాకల్టీతో కమిటీ సమావేశమై.. వారి నుంచి వివరాలు సేకరించింది. ఆ 400 ఎకరాల భూమిని కూడా వర్సిటీకే ఇవ్వాలని వారు కోరారు.
టీజీఐఐసీకి వెళ్లింది ఇట్లా..
హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత 400 ఎకరాల భూమిని తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘‘2024 జూన్ 19న ఐటీ, మిక్స్‌డ్ యూజ్ ప్రాజెక్ట్ కోసం ఈ భూమిని కేటాయించాలని టీజీఐఐసీ అభ్యర్థించింది. జూన్ 21న రాష్ట్ర కేబినెట్ ఈ కేటాయింపును ఆమోదించింది. రెవెన్యూ శాఖ జీవో నం. 54 ద్వారా 2024 జూన్ 26న ఈ భూమిని టీజీఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2024 జులై 1న భూమిని టీజీఐఐసీకి అప్పగించింది. ఇటీవల ఆ భూమిని డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అక్కడ చెట్లు నరికేసినట్లు.. జింకలు, ఇతర వన్యప్రాణులను ఇబ్బంది పెట్టినట్లు సోషల్ మీడియాలో ఫేక్ గ్రాఫిక్స్ సృష్టించి వైరల్ చేశారు. వాటిపై కోర్టుకు వెళ్లగా.. ప్రముఖులు కూడా ఫేక్ ఏఐ ఫొటోలను డిలీట్ చేశారు’’ అని సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.