- ఎల్ కేజీ, యూకేజీ స్థాయి బోధనకు ప్లాన్
- త్వరలో అంగన్వాడీ సెంటర్లకు పుస్తకాలు, యూనిఫాం
- నేటి నుంచి మాస్టర్ ట్రైనర్లతో టీచర్లకు ట్రైనింగ్
- జులై 1 నుంచి ప్రాథమిక విద్య ప్రారంభానికి ఏర్పాట్లు
- ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది చిన్నారులకు లబ్ది
ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మార్చి ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు ఆటపాటలతో చిన్నారులకు చదువు చెప్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను క్రమంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తీర్చిద్దుతోంది.
ఈ మేరకు సెంటర్లలో ఉండే 3 నుంచి 6 ఏండ్ల లోపు పిల్లలకు ఎల్కేజీ, యూకేజీ స్థాయిలో విద్యను అందించనుంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాల వారీగా ప్రభుత్వం వివరాలను సేకరించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,256 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. మొదటి విడత వెయ్యి కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యను అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారులకు ప్రశాంత వాతావరణంలో ప్రీ ప్రైమరీ విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్స్ గా రూపుదిద్దుకోనున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 8 వేల చిన్నారులకు లబ్ధి..
ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా ఎంపికైన అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రాథమిక విద్యలో భాగంగా అక్షరాలు నేర్పించనున్నారు. మొదటి విడతలో ఆదిలాబాద్ జిల్లాలోని 8 వేల చిన్నారులు లబ్ధి పొందనున్నారు. ప్రీ ప్రైమరీ విద్యను అందించేందుకు ఇప్పటికే హైదరాబాద్‌లో జిల్లా నుంచి 10 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇప్పించారు. వీరు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు బుధవారం నుంచి ప్రైమరీ విద్యపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్ ఆఫీసర్లు చెబుతున్నారు. జులై1 నుంచి క్లాసులు ప్రారంభం కానుండగా, చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయిలో బోధన చేయనున్నారు. ప్రాథమిక విద్య, ఆటపాటలు, పౌష్టికాహారం ఇలా అన్ని అంశాల్లో అంగన్వాడీ కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. చిన్నారుల్లో వచ్చిన మార్పు, అభివృద్ధిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు.
పుస్తకాలు, యూనిఫాంలు రెడీ..
జిలా వ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 1,256 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ కేంద్రాలకు అందించే పుస్తకాలను ప్రభుత్వం ఇప్పటికే సప్లై చేసింది. వాటిని సెక్టార్ల వారీగా అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్కూల్ స్టూడెంట్ల మాదిరిగానే అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు ఉచితంగా యూనిఫాంలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే యూనిఫాం కుట్టించే బాధ్యత డీఆర్డీవో ద్వారా స్వయం సహాయ సంఘాల మహిళలకు అప్పగించారు. 8,029 మందికి ఒక జత చొప్పున యూనిఫాంలు అందించనున్నారు. ఒక్కో యూనిఫాంకు బాలికలకు రూ.60, బాలురకు రూ.80 చొప్పున కుట్టు కూలీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాలికలకు ఫ్రాక్, బాలురకు నిక్కర్, షర్ట్ కుట్టిస్తున్నారు.
జులై 1 నుంచి బోధన ప్రారంభిస్తాం..
అంగన్వాడీ సెంటర్లలో ప్రీ స్కూల్ విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మాస్టర్ ట్రైనర్ల తో టీచర్లకు శిక్షణ అందించి జులై 1 నుంచి టీచింగ్ ప్రారంభిస్తాం. ప్రాథమిక విద్యకు సంబంధించిన పుస్తకాలు, యూనిఫాంలు రెడీ చేస్తున్నాం. 8,029 మంది చిన్నారులకు ఒక జత చొప్పున యూనిఫాంలు అందిస్తాం.
- సబిత, ఐసీడీఎస్ పీడీ