![ట్రిపుల్ ఆర్ దాటాక 5కి.మీ వరకు హెచ్ఎండీఏ.!..కొత్తగా చేరే మండలాలు, గ్రామాలు ఇవే..](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-government-has-decided-to-extend-hmda-up-to-5-kilometers-outside-the-regional-ring-road_8Nlkf1nAhe.jpg)
- ఇప్పటికే 7 కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం
- కొత్తగా మరో 5 జిల్లాల్లోని32 మండలాలు కలిపే యోచన
- 13 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరే అవకాశం
- భారీ పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ఊతం
- ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు
- ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)ను రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) ఆవల 5 కిలోమీటర్ల వరకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా భారీ పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వానికి చేరాయి. త్వరలో దీనికి కేబినెట్ఆమోదముద్ర పడే అవకాశముంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లతో ఉండగా, విస్తరణ తర్వాత 13 వేల చదరపు కిలోమీటర్లకు చేరనుంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు హెచ్ఎండీఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలు ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో కలిపి 8 జిల్లాలు, 74 మండలాలు, 1,000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలకు విస్తరించింది. పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న జిల్లాల్లోని కొన్ని మండలాలతో పాటు అదనంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని 32 మండలాలను కలపబోతోంది. తద్వారా ఇప్పటివరకు ఉన్న 74 మండలాల సంఖ్య కాస్తా 106 మండలాలకు చేరనుంది. ట్రిపుల్ఆర్ తో భూముల ధరలు ఇప్పటికే పెరగ్గా హెచ్ఎండీఏ విస్తరణ తర్వాత కొత్తగా కలిసిన జిల్లాల్లోనూ రియల్ఎస్టేట్మరింత పుంజుకోనున్నట్లు భావిస్తున్నారు.
భారీ పెట్టుబడులు.. ఇండస్ర్టియల్ కారిడార్
రాష్ర్ట ప్రభుత్వం సిటీ శివారులో భారీ ఎత్తున ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండగా సుమారు 15 వేల ఎకరాల్లో కొత్త నగర నిర్మాణం మొదలైంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కి.మీ. దూరంలో నార్త్, సౌత్ పార్ట్ లుగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీకి, ట్రిపుల్ఆర్ వరకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున రేడియల్ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచింది. మరోవైపు ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మెట్రో రైల్ ను సైతం విస్తరించేందుకు డీపీఆర్ రెడీ అవుతోంది. ట్రిపుల్ ఆర్పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెప్తోంది. పెద్ద ఎత్తున కంపెనీల స్థాపన, రాష్ర్టానికి చెందిన లక్షల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని, జీడీపీ గణనీయంగా పెరగుతుందని సర్కారు అంచనా వేస్తోంది.
హైదరాబాద్ అభివృద్ధిలో కీలకం
రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో హెచ్‌ఎండీఏ ప్రత్యేకం. సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ మహానగర విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తోంది. గతంలో హుడాగా ఉన్నప్పుడు, ఆ తర్వాత హెచ్‌ఎండీఏగా అవతరించిన తర్వాత నగర విస్తరణలో భాగంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీకి లేనివిధంగా15 ఏండ్ల క్రితమే హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డును హెచ్‌ఎండీఏ నిర్మించింది. ఏటా కనీసం రూ.500 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్‌ఆర్‌కు రూపకల్పన చేసింది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించి.. పీవీ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించింది. తెలుగుతల్లి, బషీర్‌బాగ్, హైటెక్ సిటీ తదితర పదికిపైగా ప్లైఓవర్లను నిర్మించి నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట, బుద్వేల్, మోకిల్లా, బాచుపల్లి, మేడిపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూర్, కుర్మల్‌గూడ, తుర్కయాంజల్.. ఇలా నగరం నలువైపులా రూ.వేల కోట్ల విలువ చేసే స్థలాలను కూడా లేఅవుట్లుగా తీర్చిదిద్ది హెచ్ఎండీఏ విక్రయించింది. ఇలా పదేండ్లలో ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏకు వచ్చిన నిధుల కంటే హెచ్‌ఎండీఏ నుంచి ప్రభుత్వానికి వచ్చిన రాబడే అధికంగా ఉండటం విశేషం.
ఇదీ హెచ్ఎండీఏ చరిత్ర
హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా)ని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. 2008లో అప్పటి ప్రభుత్వం హుడాను హెచ్ఎండీఏగా మార్చింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
కొత్తగా చేరే మండలాలు, గ్రామాలు ఇవే..
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 22 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మాడుగుల, కడ్తాల్, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్ మండలాలు చేరనున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 3 మండలాలు ఉండగా.. జగదేవ్‌పూర్, గజ్వేల్, రాయపోల్ చేరనున్నాయి. మెదక్ జిల్లాలో ఇదివరకే 5 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మాసాయిపేట చేరనుంది. సంగారెడ్డి జిల్లాలో 8 మండలాలుండగా.. కొత్తగా కొండాపూర్, సదాశివపేట, చౌటకూర్ చేరనున్నాయి. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 5 మండలాలుండగా.. కొత్తగా రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, సంస్థాన్ నారాయణపురం, వలిగొండ మండలాలు చేరనున్నాయి. అలాగే, నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, చండూరు, చింతపల్లి మండలాల్లో కొన్ని గ్రామాలు కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. వికారాబాద్ జిల్లా హెచ్‌ఎండీఏ పరిధిలోకి కొత్తగా చేరనుంది. ఇందులో నవాబ్‌పేట, పరిగి, పూడూరు, వికారాబాద్, మోమిన్‌పేట, మండలాల్లోని కొన్ని గ్రామాలు హెచ్‌ఎండీఏలోకి రానున్నాయి. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట, రాజాపూర్, బాలానగర్ మండలాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా ఇందులోకి రానున్నాయి.
కొత్తగా విస్తరించనున్న హెచ్ఎండీఏ పరిధి
- ( 13,000చదరపు కిలోమీటర్లు)
- హుడా (1,348 చదరపు కిలోమీటర్లు)
- అవుటర్ రింగ్‌రోడ్డు (330చదరపు కిలోమీటర్లు)
- జీహెచ్ఎంసీ
- (650 చదరపు కిలోమీటర్లు)
- హైదరాబాద్ అగ్లోమరేషన్(1,806 చదరపు కిలోమీటర్లు)
- హైదరాబాద్ మెట్రో పాలిటన్రీజియన్ (7,257 చదరపు కిలోమీటర్లు)
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్డెవలప్మెంట్అథారిటీ (హడా) (458 చదరపు కిలోమీటర్లు)