ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు : బడ్జెట్‌‌‌‌లో రూ.200 కోట్లు కేటాయింపు

ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు : బడ్జెట్‌‌‌‌లో రూ.200 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ డిజిటల్  హెల్త్ కార్డు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌‌‌‌లో రూ.200 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం బడ్జెట్  ప్రసంగంలో వెల్లడించారు. రాష్ట్రంలో యూనివర్సల్  హెల్త్ కేర్  విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని, ప్రతిఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్  చేస్తామని ఆయన తెలిపారు.

వేగంగా రోగ నిర్ధారణ చేసి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. దశలవారీగా ఈఎన్‌‌‌‌టీ, కంటి, మానసిక ఆరోగ్య వైద్యసేవలను రాష్ట్రమంతటా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈసారి మొత్తంగా ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లను కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు ప్రభుత్వ మెడికల్  కాలేజీలు, నర్సింగ్  కాలేజీల నిర్మాణానికి బడ్జెట్  కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్  హెల్త్  సిటీ, సూపర్  స్పెషాలిటీ హాస్పిటళ్లు, మెడికల్  కాలేజీలు, టీచింగ్  హాస్పిటళ్లు, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మెడికల్  కాలేజీల ఏర్పాటుకు రూ.542 కోట్లు, నర్సింగ్  కాలేజీల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి రూ.260 కోట్లను ప్రతిపాదించారు. మొత్తంగా ఈ బడ్జెట్‌‌‌‌  రూ.1,002 కోట్లు కావడం గమనార్హం. హాస్పిటళ్లలో డయాగ్నస్టిక్  ఎక్విప్‌‌‌‌మెంట్  కొనుగోలు కోసం రూ.250 కోట్లు, టీచింగ్  హాస్పిటళ్ల నిర్మాణానికి రూ.121.58 కోట్లు కేటాయించారు.

ఆరోగ్యశ్రీకి కొద్దిగా తగ్గిన నిధులు

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీకి రూ.1,065 కోట్లు కేటాయించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన ప్రభుత్వం.. ఇటీవలే ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను సగటున 20 శాతం మేర పెంచింది. కొత్తగా 163 రకాల చికిత్స ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చింది. దీంతో ఈసారి ఆరోగ్యశ్రీకి ఎక్కువ నిధులు కేటాయిస్తారని భావించినప్పటికీ నిరుటి కన్నా సుమారు రూ.36 కోట్లు తక్కువగా కేటాయించారు.

గతేడాది కేటాయించిన రూ.1,101 కోట్లలో, సుమారు రూ.850 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని, ఈ నేపథ్యంలో తక్కువగా కేటాయించి ఉండొచ్చని సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు  కోరుతున్నట్లుగా ఈహెచ్‌‌‌‌ఎస్  స్కీమ్  బలోపేతానికి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కంట్రిబ్యూషన్  తీసుకునే అవకాశం కూడా ఉందని, తద్వారా సుమారు రూ.210 కోట్ల వరకూ నిధులు సమకూరుతాయని అధికారులు చెబుతున్నారు.

హాస్పిటళ్ల  అప్‌‌‌‌గ్రెడేషన్, మెడిసిన్  కొనుగోలు, ఉద్యోగుల వేతనాలు, దవాఖాన్లలో కొత్త ఎక్విప్‌‌‌‌మెంట్  కొనుగోలు తదితర అవసరాల కోసం గతంలో మాదిరిగానే కేటాయింపులు చేశారు. ఇక క్యాన్సర్  నివారణ కోసం రూ.4.51 కోట్లు కేటాయించింది. ఎంఎన్‌‌‌‌జే  క్యాన్సర్  హాస్పిటల్‌‌‌‌లో కొత్త బిల్డింగ్  నిర్మాణానికి రూ.8 కోట్లు ప్రతిపాదించింది. గత ప్రభుత్వం ఎత్తేసిన 104 సర్వీసుల నిర్వహణ కోసం ఈసారి బడ్జెట్‌‌‌‌లో రూ.21.74 కోట్లు కేటాయించడం గమనార్హం. అమ్మఒడి కార్యక్రమానికి రూ.141.31 కోట్లు ప్రతిపాదించారు.