- ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 బోనస్ చెల్లింపు
- ఇయ్యాల కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ
- నిధులు విడుదల చేయాలని సీఎండీని ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ కింద రూ.358 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొడక్షన్ లింక్డ్ రికార్డ్ స్కీమ్(పీఎల్ఆర్ఎస్)ను దీపావళి బోనస్ గా సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గురువారం సెక్రటేరియెట్ లో డిప్యూటీ సీఎం సింగరేణిపై సమీక్ష నిర్వహించారు. బోనస్ కోసం రూ.358 కోట్లు విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ను ఆదేశించారు.
నిరుడు సింగరేణి చెల్లించిన దీపావళి బోనస్ కన్నా తాజా బోనస్ రూ.50 కోట్లు ఎక్కువ కావడం విశేషం. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి రూ.93,750 లు అందనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కల్లా కార్మికుల బ్యాంకు అకౌంట్లలో బోనస్ జమ చేయనున్నారు. దీపావళి బోనస్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40వేల మంది కార్మికులకు వర్తిస్తుంది.
జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్ చెల్లించే పద్ధతి గత కొన్నేండ్లుగా అమలులో ఉంది. ఈ ఏడాది కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా ఆదేశాలిచ్చారు.
ఒక్క అక్టోబర్లోనే కార్మికులకు రూ.1250 కోట్లు
సింగరేణి ఉద్యోగులందరికీ 33% లాభాల వాటా కింద రూ.796 కోట్లు ఇటీవల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేలు అందాయి. దసరా పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికునికి రూ.25వేల చొప్పున మరో రూ.90 కోట్ల చెల్లించింది. తాజాగా దీపావళి బోనస్ తో లాభాల వాటా, దసరా పండుగ అడ్వాన్స్ కింద రూ.1250 కోట్లు అందించింది.
ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ అక్టోబర్నెలలో ఒక్కొక్కరు దాదాపు రూ.3 లక్షల వరకు అందుకున్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ బోనస్ చెల్లింపుపై తగు ఏర్పాటు చేయాలని పర్సనల్, ఫైనాన్స్ విభాగం అధికారులను ఆదేశించారు.