
- కర్నాటక మోడల్‌ను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
- రిజిస్ట్రేషన్ల టైంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసే చాన్స్
- మండలానికి ఇద్దరు ప్రభుత్వ సర్వేయర్లు ఉండేలా ప్రతిపాదనలు
- 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయాలని ఆలోచన
హైదరాబాద్, వెలుగు: భూములు సర్వే చేయించుకునే బాధ్యతను రైతులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ క్రమంలో పట్టా పాసుపుస్తకాల్లో నమోదైన విస్తీర్ణం ఎక్కువ ఉన్నా.. ఫీల్డ్‌లో ఒక రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమినే ప్రామాణికంగా తీసుకుంటారు. త్వరలోనే భూ భారతి రూల్స్‌ను అమల్లోకి తీసుకురానున్నందున.. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాల్లో అమలు చేశాక.. రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నది.
ఇందులో భాగంగా రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం తరఫున భూములను సర్వే చేసే పద్ధతికి నో చెప్పింది. రైతులే వారి భూములను సర్వే చేయించుకుని రిజిస్ట్రేషన్ కు వచ్చేలా చేయనుంది. ఇందుకు అవసరమైన చార్జీలు కూడా రైతుల దగ్గర నుంచే తీసుకోవాలని భావిస్తున్నది. అవసరం ఉన్న ప్రతి రైతు వారి భూములను సర్వే నంబర్ల వారీగా సర్వే చేయించుకుని మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా సర్వే మ్యాప్ అనేది ఆప్షనల్‌గా ఉంచుతున్నప్పటికీ.. భూముల అమ్మకాలు, కొనుగోళ్ల టైంలో మాత్రం తప్పనిసరి కానుంది. అంటే, ఒక రైతు భూమిని ఇంకొకరి పేరు మీదికి బదిలీ చేయిస్తున్నారంటే ఖచ్చితంగా సర్వే చేయించుకుని మ్యాప్‌కు మండల సర్వేయర్ ఆమోదం తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దీర్ఘకాలంలో పూర్తిగా భూ సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. కర్నాటకలో ఇదే మోడల్లో 95 శాతం సర్వే పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వం నుంచి వెయ్యి.. ప్రైవేట్‌లో 6 వేల మంది సర్వేయర్లు
గ్రామాల్లో భూములను సర్వే చేసేందుకు సర్టిఫైడ్ సర్వేయర్లను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తే ప్రతి రైతు భూములను సర్వే చేయించుకుంటారని.. ఈ క్రమంలో సర్వేయర్లకు చాలా డిమాండ్ పెరుగుతుందని ముందే అంచనా వేసింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఇద్దరు సర్వేయర్లు.. ఒక సర్వేయర్, ఒక డిప్యూటీ సర్వేయర్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడున్న సర్వేయర్ల సంఖ్యను వెయ్యికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖల్లోకి వెళ్లిన వీఆర్ఓ, వీఆర్ఏల్లో అర్హత ఉన్నవారి నుంచి ఆప్షన్స్ తీసుకుని వాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ క్లాస్‌లు ఇప్పించి తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇక, ప్రైవేట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్డ్ సర్వేయర్ లకు అవకాశం కల్పించాలనుకుంటున్నది. వీరికి కూడా ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయనున్నారు. ప్రైవేట్ సర్వేయర్.. రైతు భూమిని సర్వే చేసిన తర్వాత మండల సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ ఆమోదం తీసుకుని ఆ మ్యాప్‌కు ఆమోద ముద్ర వేసేలా ప్రొసిజర్ తీసుకురానున్నారు. అదే మ్యాప్‌ను రిజిస్ట్రేషన్ల సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు.
పొజిషన్లో ఎంత భూమి ఉంటే అంతే పరిగణనలోకి
ప్రస్తుతం పొజిషన్ లోని భూమి, రికార్డులకు చాలా తేడా ఉంది. లక్షల ఎకరాల్లో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఒక పట్టాదారుకు 6 ఎకరాల భూమి రికార్డులో ఉండి, ఫీల్డ్‌పైన 5 ఎకరాలు మాత్రమే ఉంటే.. అందులో 5 ఎకరాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేసి.. సర్వే మ్యాప్‌ను సిద్ధం చేస్తారు. ఒకవేళ ఇతరులు భూముల సరిహద్దులు అటు ఇటుగా చేసినట్లు అనుమానాలు ఉంటే.. పక్క భూములను కూడా సర్వే చేసి.. మిగతా భూమి ఎంత వస్తే అంత తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వమే సర్వే చేస్తే భూవివాదాలు మరింత ఎక్కువ అవుతాయని సర్కార్ భావిస్తున్నది. అందులో భాగంగానే దీనిని రైతులతోనే చేయించేలా ప్లాన్ చేసింది. ప్రస్తుతం 1936వ సంవత్సరంలో అనగా... 89 ఏండ్ల కిందటి నిజాం పరిపాలనలో చేసిన భూసర్వేనే ప్రామాణికంగా.. నాటి వివరాల ఆధారంగానే దస్త్రాలు కొనసాగుతున్నాయి. కాలంతో పాటు భూ యజమానులు కూడా మారుతూ రాగా... భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి. సాగు విస్తీర్ణం, నివాస ప్రాంతాలు అనూహ్యంగా పెరిగాయి. వాగులు, వంకలు, చెరువులు, కొండలు, గుట్టలు, ఇతర వనరుల భౌతిక రూపం పూర్తిగా మారిపోయింది.