
- బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు
- కులగణనలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే
- సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం
- ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తం: డిప్యూటీ సీఎం భట్టి
- రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తం
- ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తీసుకురానుంది. కులగణన రిపోర్టు ప్రకారం బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తేనున్న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపించి.. దాన్ని పార్లమెంట్లోనూ ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల జరిగిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1% (16 లక్షల) మంది తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16 నుంచి 28 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై చర్చ జరిగింది. కమిషన్ సిఫార్సులు, సుప్రీం తీర్పు ప్రకారం.. బీసీలకు చట్టబద్ధంగా 22 నుంచి 23 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని, మిగిలిన 20 శాతం పార్టీ పరంగా ఇచ్చుకోవాల్సిందేనని సీఎంకు అధికారులు వివరించారు.
కానీ కామారెడ్డి డిక్లరేషన్, జనాభాలో ఎవరెంతో వారికంత అన్న రాహుల్ గాంధీనినాదం ప్రకారం.. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు తేల్చి చెప్పారు. చట్టం చేస్తే విద్య, ఉపాధి అవకాశాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసుకునే అవకాశం ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ కుట్రలను తిప్పకొడ్తం: భట్టి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమై కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోయినా.. ఆ రెండు, మూడు నెలలకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సీఎంతో రివ్యూ మీటింగ్ అనంతరం సెక్రటేరియెట్లో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్మాట్లాడారు.
రిజర్వేషన్లపై రాజకీయంగా కుట్రలు చేస్తే తిప్పి కొడతామని భట్టి అన్నారు. బీసీల కల నెరవేర్చేందుకు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘బీసీ రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్లో చర్చిస్తం. ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టి ఆమోదింపజేస్తం. దాన్ని పార్లమెంట్ లోనూ ఆమోదించేందుకు కేంద్రానికి పంపిస్తం. దీనిపై కలసి వచ్చే రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళ్తుంది. ప్రధాని మోదీతో పాటు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేసి.. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ చేయించేందుకు కృషి చేస్తం” అని వెల్లడించారు.
మూడు పద్ధతుల్లో సర్వే
కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్రెడ్డి లాంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు. వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నం. వీరి నుంచి మూడు రకాలుగా వివరాలు సేకరిస్తం. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తం. దానికి ఫోన్చేస్తే అధికారులు వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేయించుకునేందుకు చాన్స్ ఇస్తం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క