- రైతు బంధు దాకా..కల్యాణ లక్ష్మి, డబుల్ ఇండ్లు,
- దళిత బంధు లాంటి స్కీమ్స్‌పైనా ఫీల్డ్ ఎంక్వైరీలు
- అనర్హుల నుంచి రైతు బంధు,ఆసరా పెన్షన్ల రికవరీకి నోటీసులిస్తున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలని, తద్వారా దుబారాకు చెక్ పెట్టాలని రాష్ట్ర సర్కారునిర్ణయించింది. గత సర్కారు హయాంలో అడ్డదారిలో స్కీమ్స్ పొందిన అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆయా స్కీమ్స్‌లో లబ్ధిదారుల లిస్టులతో ఇప్పటికే ఫీల్డ్సర్వేలు చేయిస్తున్న ప్రభుత్వం అనర్హులను గుర్తించి, వారి పేర్లను లిస్టుల్లోంచి తొలగిస్తున్నది. అవసరం అనుకున్నచోట ఇప్పటిదాకా స్వాహా చేసిన సొమ్మును ఆయా శాఖల అధికారుల ద్వారా రికవరీ చేయిస్తున్నది. ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు లాంటి అన్ని పథకాలకు సంబంధించి ఫీల్డ్ఎంక్వైరీ జరుగుతున్నది. ఆయా స్కీమ్స్ ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధిపొందారు? ఎంతమేరకు ప్రజాధనం దుర్వినియోగం అయింది? లాంటి వివరాలను ఆఫీసర్లు జిల్లాలవారీగా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు సర్కారుకు అందిన సమాచారం ప్రకారం ఒక్క రైతుబంధులోనే రూ.25,672 కోట్లు దుర్వినియోగం కాగా.. ఆసరాలో గడిచిన మూడేండ్లలో (2018–21 వరకు) రూ.1,768 కోట్లు అనర్హులకు చేరాయి.
నిరుపేదలకు, దిక్కుమొక్కులేని అభాగ్యులకు, వృద్ధులకు అందించాల్సిన ఆసరా పింఛన్లను వేలకు వేలు పెన్షన్లు తీసుకుంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబీకులకు, ధనవంతులకు, చనిపోయినవాళ్లకు గుడ్డిగా ఇస్తున్నట్టు ఇటీవలి సెర్ప్ తనిఖీల్లో బయటపడింది. గత సర్కారు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలోనూ రెండు వేల మందికి పైగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే తిష్టవేసినట్టు తేలింది. గొర్రెల స్కీమ్‌లోనూ దాదాపు రూ.5 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని వెల్లడైంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంపద పెరగలేదని, రీ సైక్లింగ్దందాతో కొంత మంది ఆఫీసర్లు, దళారులే లాభపడ్డారని ఎంక్వైరీలో తేలింది. కల్యాణలక్ష్మి, ఆఖరుకు సీఎంఆర్ఎఫ్లోనూ అడ్డగోలు అక్రమాలున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర భూములకు పొందిన రైతుబంధును, అర్హత లేకుండా తీసుకున్న పింఛన్లను రికవరీ చేసేందుకు ఆఫీసర్లు నోటీసులు జారీ చేస్తున్నారు.
రైతుబంధులో భారీగా నిధుల దుర్వినియోగం..
రైతుబంధు పథకంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. కష్టనష్టాలకోర్చి పంటలు పండించే కౌలు రైతులకు గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదు. అదే సమయంలో సాగులో లేని రాళ్లు రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు ఇతరత్రా వాటికి ఏకంగా రూ.25,672 కోట్లు చెల్లించినట్టు రేవంత్ సర్కారు చేసిన ఎంక్వైరీలో బయటపడింది. అంటే ఏడాదికి యావరేజ్‌గా రూ.4 వేల కోట్లు దుబారా అయ్యాయి. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు సైతం పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇవ్వడంతో పేద రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం నేరవేరలేదు. ఫలితంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లెక్కలు తీస్తున్నది. కల్యాణ లక్ష్మి కింద కూడా అనర్హులు లబ్ధి పొందినట్టు విజిలెన్స్ఎంక్వైరీలో తేలింది.
డబుల్ బెడ్రూం ఇండ్లు.. గొర్రెల స్కీమ్‌లోనూ.
గొర్రెల స్కీమ్‌లో అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే కాగ్రిపోర్ట్లో వెల్లడైంది. ఈ స్కీమ్‌లో అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. మనీ ల్యాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ వ్యవహారంలో ఎంటరైంది. గొర్రెల స్కీంలోనూ నిబంధనలు సరిగ్గా లేకపోవడం , సరైన మానిటరింగ్ చేయకపోవడంతో ఈ స్కీం ప్రాజెక్ట్ కాస్ట్ రూ.5 వేల కోట్లు గంగలో కలిసిన ట్లయ్యాయి. గొర్రెల రీసైక్లింగ్దందాతో గొల్ల, కుర్మలు లాభపడకపోగా, కొందరు ఆఫీసర్లు, దళారులు కోట్లకు పడగెత్తారు. ఇక డబుల్ బెడ్రూం ఇండ్లనూ బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు, అనర్హుల కు అందించారనే ఆరోపణలున్నాయి. తాజాగా, ఆ వివరాలను కూడా సర్కారు సేకరిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో సొంత ఇండ్లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలకు పంచినట్టు ప్రాథమికంగా తేలడంతో లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు నిర్వాకంతో ఇండ్లు లేని నిరుపేదలకు ఈ స్కీం కింద లబ్ధి జరగలేదు.
రికవరీకి నోటీసులు..
సంక్షేమ పథకాల్లో అక్రమాలు బయటపడుతుండడంతో రికవరీపై ఆఫీసర్లు దృష్టిపెట్టారు. ఇంతకాలం అక్రమంగా పొందిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనర్హులకు నోటీసులిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి ఇన్నాళ్లూ రైతుబంధు అందగా, ఆ సొమ్ము వసూలుకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఘట్కేసర్ మండలం పోచారం గ్రామంలో మోత్కుపల్లి యాదగిరి రెడ్డి అనే వ్యక్తి 38, 39, 40 సర్వే నంబర్లలో ఉన్న 30 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు కింద ఇప్పటివరకు రూ.16.80 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏండ్ల వృద్ధురాలికి రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ గా డిపెండెంట్ కింద ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తోంది. మరోవైపు ఈమెకు నెలనెలా ఆసరా పింఛన్ చెల్లిస్తున్న విషయం బయటపడడంతో రికవరీకి నోటీసులు ఇవ్వడం గమనార్హం.
నాడు కాగ్ ఏం చెప్పిందంటే
గడిచిన రెండేండ్లు కాగ్రిపోర్ట్ ను గత ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓటాన్ అకౌంట్బడ్జెట్సమావేశాల్లో కాగ్ రిపోర్టులను సమర్పించింది. దీంతో గత ప్రభుత్వ స్కీముల్లో జరిగిన అక్రమాలు బయటకు వచ్చాయి. కొంతమంది అనర్హులు ఆసరా పింఛన్లు పొందుతున్నారని ఆఫీసర్లు గుర్తించినప్పటికీ, జాబితా నుంచి వాళ్ల పేర్లు తొలగించకపోవడాన్ని కాగ్ తప్పుపట్టింది. గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని చెప్పింది. ఇక దివ్యాంగుల కేటగిరీలో రూ.71.90 కోట్లు, బీడీ కార్మికుల కేటగిరీలో రూ.446.96 కోట్లు, ఒంటరి మహిళల కేటగిరీలో రూ.1.70 కోట్లు, ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇవ్వడం ద్వారా రూ.14.83 కోట్ల మేర కలిపి మొత్తంగా రూ.535.39 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయని వివరించింది. మరోవైపు 2018 నుంచి 2021 వరకు సగటున నెలకు 2.30 లక్షల మందికి పింఛన్ చెల్లించలేదని తెలిపింది. అర్హత లేకపోయినా 16 శాతం కుటుంబాలకు పింఛన్ చెల్లించినట్టు స్పష్టంచేసింది.