జిల్లా కొక సోలార్ ప్లాంట్ .. అనువైన స్థలాలు గుర్తించిన అధికారులు

జిల్లా కొక సోలార్ ప్లాంట్ .. అనువైన స్థలాలు గుర్తించిన అధికారులు
  • 2 మెగావాట్ల యూనిట్​ ఏర్పాటుకు ప్లాన్​
  • ఒక్కో మెగా వాట్ కు రూ.3 కోట్ల వ్యయం 
  • ఏ గ్రేడ్ విలేజ్​ ఆర్గనైజేషన్​లకు అవకాశం 

మెదక్, వెలుగు : ఖాళీగా ఉన్న ఎండోమెంట్, ఇరిగేషన్, అసైన్డ్​ భూములను వినియోగంలోకి తేవడంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక సోలార్ పవర్​ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అధికారులు ఎక్కడెక్కడ అనువైన భూములు ఉన్నాయో పరిశీలించారు. చాలా జిల్లాల్లో వందలాది ఎకరాల ఎండోమెంట్, ఇరిగేషన్​ భూములు వృధాగా ఉన్నాయి. ఖాళీగా ఉండటంవల్ల ఖరీదైన ఈ భూములు కొన్ని చోట్ల అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక్కో జిల్లాలో 150 ఎకరాల భూమి గుర్తించి ఐదేండ్లలో రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల సోలార్​ప్లాంట్​లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుంది.

 ఖాళీగా ఉన్న ఎండోమెంట్​, ఇరిగేషన్​, అసైన్డ్​ భూములను గుర్తించి.. ప్లాంట్​ఏర్పాటుకు గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పైలెట్​ ప్రాజెక్ట్​ కింద ప్రతి జిల్లాలో 2 మెగా వాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. మొదటివిడత 32 జిల్లాల్లో 64 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సోలార్​ ప్లాంట్​ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఒక మెగావాట్​ విద్యుత్​ ఉత్పత్తి యూనిట్​ ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి అవసరం కాగా ఒక్కో మెగా వాట్ ప్లాంట్​ ఏర్పాటు కోసం రూ.3 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్కో జిల్లాకు రూ.6 కోట్ల చొప్పున మొత్తం రూ.192 కోట్లు అవసరమని అంచనా వేశారు. గ్రామీణాభివృద్ధి, ఇంధన శాఖ ఎండోమెంట్, ఇరిగేషన్​ భూముల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

  ఒక్కో మెగావాట్​ సోలార్​ ప్లాంట్​ ఏర్పాటుకు మొత్తం రూ.3 కోట్లు ఖర్చుకాగా ఇందులో సెల్ఫ్​ హెల్ప్​ గ్రూప్​ వాటా కింద రూ.30 లక్షలు మహిళ సంఘాలు పెట్టుబడి పెట్టాల్సిఉంటుంది, మిగతా మొత్తం స్త్రీనిధి ద్వారా లోన్​గా సమకూర్చనున్నారు. పొదుపు, రుణాల సద్వినియోగం, రికవరీల్లో ఆదర్శంగా ఉన్న విలేజీ ఆర్గనైజేషన్(వీఓ)లను ఏ గ్రేడ్​ కింద గుర్తిస్తారు. ఏ గ్రేడ్​ లో ఉన్న​ వీఓ లకు ఈ ప్లాంట్​లను అప్పగిస్తారు. ప్లాంట్​ ఏర్పాటుకు భూముల ఎంపిక తర్వాత నిధులమంజూరు. అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికయిన వీఓలకు సోలార్​ ప్లాంట్ నిర్వహణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి నెల 8 లోగా సోలార్​ ప్లాంట్​ల ఏర్పాటు పూర్తిచేసి విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభించాలని సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు.