మూడెకరాల వరకు రైతు భరోసా జమ

మూడెకరాల వరకు రైతు భరోసా జమ
  • 9.56 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,230.98 కోట్ల నిధులు
  • ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడెకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసింది. బుధవారం రూ.1,230.98 కోట్లను రైతు అకౌంట్లలో వేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. జనవరి 26న పైలెట్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి రూ.568.99 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల ఎకరాల భూమికి గాను రూ.557.54 కోట్లు జమ చేశారు. 

రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఈ నెల 10న 13.23 లక్షల మందికి, ఈ నెల 12న రికార్డులు అప్‌‌‌‌డేట్ చేసిన 56 వేల మంది రైతులకు రూ.38.34 కోట్లతో కలిపి మొత్తం రూ.1,130.29 కోట్లు నిధులు జమ చేశారు. అదే రోజు మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మంది రైతులకు చెందిన 20.51 లక్షల ఎకరాలకు రూ.1,230.98 కోట్లు నిధులను డైరెక్ట్​ బెనిఫీషియరీ ట్రాన్స్‌‌‌‌ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో వేశారు. దీంతో ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద రూ.3,487.82 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.