నిర్మాత దిల్ రాజుకి కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్..

  • రెండేళ్ల పాటు కీలక బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
  • స్వస్థలం నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి
  • అసలు పేరు వెంకటరమణా రెడ్డి

హైదరాబాద్: సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్ల  పాటు కొనసాగుతారు. దిల్ రాజు అసలు పేరు వీ వెంకటరమణారెడ్డి. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామం. మాపల్లె చారిటబుల్  ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఇందూరు తిరుమల పేరుతో గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. చిన జీయరు స్వామికి శిష్యుడిగా ఉన్నారు.  1990లో ‘పెళ్లి పందిరి’ సినిమాలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్‌ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్‌ రాజుగా మారింది.

ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకోసం దాదాపుగా రూ.300 కోట్లు బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కీయార అద్వానీ నటిస్తుండగా ప్రముఖ డైరెక్టర్, విలన్ ఎస్. జె సూర్య, సునీల్, శ్రీకాంత్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలేజ్ కాబోతోంది.