విద్యా శాఖకు ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ బాధ్యతలు

విద్యా శాఖకు ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ బాధ్యతలు
  • తొలి దశలో కొడంగల్, మధిరలో నిర్మాణం
  • బిల్డింగ్ ప్లాన్ రెడీ అయ్యాకే టెండర్లు ప్రకటన
  • కార్పొరేషన్ ఎండీగా  గణపతిరెడ్డి నియామకం

హైదరాబాద్, వెలుగు: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. విద్యా శాఖలో ఉన్న టీఈడబ్ల్యూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ )గురుకులాలను నిర్మించనుంది. అంతకు ముందు ఆర్ అండ్ బీకి అప్పగించగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. తొలి దశలో కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 

డిజైన్లు ఫైనల్ కావటంతో పాటు ల్యాండ్ ఫైనల్ అయ్యింది. భవనాల నిర్మాణ డిజైన్ల తయారీ, నిర్మాణ వ్యయం  ఆర్కిటెక్చర్ బాధ్యతలను  బెంగళూరుకు చెందిన మనోజ్ అసోసియేట్స్ కు ప్రభుత్వం అప్పగించింది. ఈ  రెండు ప్రాంతాలను ఆర్కిటెక్ట్ కంపెనీ ప్రతినిధులు పరిశీలించి ఇక్కడ భూమిని టెస్ట్ చేయడం, గురుకులాల బిల్డింగ్ లు, అడ్మినిస్ర్టేటివ్ బ్లాక్, కిచెన్, డైనింగ్ హాల్, పార్కింగ్, గార్డెనింగ్, గ్రౌండ్ వంటి వాటిని ఎక్కడ నిర్మించాలన్న అంశాలపై ప్లాన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ త్వరలో ప్రభుత్వానికి అందచేసిన తరువాత పరిశీలించి అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇవ్వనున్నారు. ఆ తరువాత టెండర్లు పిలవనున్నారు. 

గురుకులాల నుంచి నిధులు..  

అన్ని గురుకులాలను ఒకే క్యాంపస్ లో నిర్మిస్తుండగా ఈ నిధులను ఆయా శాఖల బడ్జెట్ ఫండ్స్ నుంచి ఖర్చు చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోంచి రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల చొప్పున విద్యాశాఖకు  బదిలీ చేయనున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఏడాదిన్నర నుంచి రెండేండ్లల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం గడువు ఇవ్వనుంది. కాగా, రాష్ర్టంలో తొలి దశలో  28 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్  స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించే ఈ స్కూళ్లకు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్నారు. దసరా రోజు సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గంలో, మంత్రులు ఆయా జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపనలు చేశారు. వీటిపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వివరాలు తెలియజేశారు. ఈ 28 చోట్ల భూమిని ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి తీసుకొని బోర్డులు ఏర్పాటు చేశామని కలెక్టర్లు ప్రభుత్వానికి తెలిపారు.

గణపతి రెడ్డికి బాధ్యతలు

టీఈడబ్ల్యూఐడీసీ కార్పొరేషన్ ఎండీగా గణపతిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కాలం వరకు ఆర్ & బీ  ఈఎన్సీ ( బిల్డింగ్స్ , నేషనల్ హైవేస్ ) పనిచేసి ఆ పోస్టుకు సెప్టెంబర్  3న  రాజీనామా  చేశారు.  ఆర్ అండ్ బీ సీఈగా ఉన్న గణపతిరెడ్డి రిటైర్ కాగా గత ప్రభుత్వం సర్వీస్ పొడిగించి ఆర్ అండ్ బీ ఈఎన్సీగా నియమించింది.  గత 10 ఏండ్లలో రాష్ర్టంలో సెక్రటేరియట్,  అమరవీరుల స్తూపం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణలన్ని ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. నిర్మాణ రంగంలో విశేష అనుభవం ఉన్న ఆయనకు ఇంటిగ్రేటెడ్ గురుకుల నిర్మాణ బాధ్యతలు సీఎం అప్పగించారు.