కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ

కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ
  • మైనింగ్ కాలేజీని అప్​గ్రేడ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు
  • 2025–26 అకడమిక్ ఇయర్ నుంచే క్లాసులు

హైదరాబాద్, వెలుగు: కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి దాకా కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్​గా ఉన్న దాన్ని.. వర్సిటీగా అప్​గ్రేడ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెంలో కాకతీయ వర్సిటీ పరిధిలో స్కూల్ ఆఫ్ మైన్స్ పేరుతో కాలేజీ కొనసాగుతున్నది. అయితే, సహజవనరులు పుష్కలంగా ఉన్న ఆ ప్రాంతంలో వర్సిటీ పెట్టాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఇటీవలే అసెంబ్లీలోనూ అక్కడ వర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. దీనికి అనుగుణంగా తాజాగా అక్కడి కాలేజీని అప్ గ్రేడ్ చేస్తూ ఎర్స్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ పేరుతో వర్సిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు జీవో రిలీజ్ చేసింది. దీనికి అనుగుణంగా తెలంగాణ యూనివర్సిటీల చట్టం 1991కు సవరణ చేసింది. అయితే, ప్రస్తుతమున్న కాలేజీని వర్సిటీగా అప్​గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ఇటీవలే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ నివేదిక అందించారు. దీనికి సర్కారు ఆమోదం తెలిపింది.

 ఈ నేపథ్యంలో కొత్తగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌‌లోని బోధన, బోధనేతర పోస్టులతో సహా ప్రస్తుత ఆస్తులను కాకతీయ వర్సిటీ నుంచి పూర్తిగా కొత్త వర్సిటీకి అప్పగించనున్నారు. వర్సిటీ మెయిన్ ఆఫీస్ కొత్తగూడెంలో ఉంటుందని సర్కారు ప్రకటించింది. 2025–26 విద్యాసంవత్సరం నుంచే వర్సిటీలో క్లాసులు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్​డీ కోర్సులు కొనసాగనున్నాయి. భూగోళ శాస్ర్తానికి సంబంధించి కోర్సులు పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ వర్సిటీ ఏర్పాటుతో పాటు నిధులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే, పెట్టే కోర్సులకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేయనున్నారు.