
- 50ఆకుల కట్ట ధర రూ3.30 గా నిర్ణయించిన ప్రభుత్వం
- గతంలో కంటే కట్టకురూ.30 పైసలు అదనం
- గిట్టుబాటు కావడం లేదంటున్న కాంట్రాక్టర్లు
- 2, 3వ విడత టెండర్ల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
మహబూబాబాద్, వెలుగు: కాసులు కురిపించే తునికాకు సేకరణపై నీలినీడలు అలుముకున్నాయి. ఆకు సేకరణ సమయం ముంచుకొస్తుండగా, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో తునికాకు సేకరణ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్ మెంట్కార్పొరేషన్తునికాకు సేకరణకు ఆన్లైన్ టెండర్ల నిర్వహణకు ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ జారీ చేసింది. తొలివిడత టెండర్‌ను ఫిబ్రవరి 27, 28న సబ్మిట్ చేయగా, 28న సాయంత్రం ఓపెన్చేశారు.
మొత్తం 191 తునికాకు సేకరణ కల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, కేవలం 9 కల్లాలను మాత్రమే ఫైనల్ చేశారు. 185 కల్లాలకు ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ ధర రాకపోవడంతో రెండో విడత ఈ నెల 6న, 7న, మూడో విడత ఈ నెల 17న, 18న ఆన్లైన్లో ఈ టెండర్ నిర్వహించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్జిల్లాల పరిధిలోనే తునికాకు కల్లాలను నిర్వహించనున్నారు. మరోవైపు ఎండలు షురూ కావడంతో ఉపాధి కోసం కూలీలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
గిట్టుబాటు లేదు..
రాష్ట్ర ప్రభుత్వం తునికాకు సేకరణకు ఏటా ధరలు పెంచడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. గతంలో కంటే 50 ఆకులతునికాకు కట్ట ధర రూ.30 పైసలు పెంచడం, జీఎస్టీ 18 శాతం, ఇన్కమ్ ట్యాక్స్ 5 శాతం. లారీల రవాణా చార్జీలు, హమాలీ, కాపలా మనుషుల ఖర్చులతోపాటు మేలో అకాల వర్షాలు పడితే తునికాకు కట్టలు తడిచి చెదలు పడుతూ నష్టం వస్తున్నట్లుగా తెలిపారు.
ఫ్రూనింగ్ నిర్వహణ మరింత ఆలస్యం..
తునికాకు సేకరణకు ముందు కల్లాల కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారులు కూలీలతో తునికాకు చెట్లకు ఫ్రూనింగ్ ( కొమ్మ కొట్టడం) చేయిస్తారు. దీంతో నాణ్యమైన ఆకుల సేకరణకు వీలుంటుంది. మార్చి మొదటి వారంలోనే కొమ్మ కొట్టడం నిర్వహించాలి కానీ, ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మరింత ఆలస్యం కానున్నది. దీంతో నాణ్యమైన ఆకు సేకరణ కష్టమవుతుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ధరలు సడలించాలి..
అటవీ ప్రాంతంలోని ఆదివాసులు, గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణను ప్రభుత్వం ఆదాయం వనరుగా భావించకూడదు. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్‌ల భారం మోయలేకుండా ఉంది. కాంట్రాక్టర్లకు గిట్టుబాటు అయ్యే విధంగా పాత ధరను నిర్ణయించడంతోపాటు, వీలైనంత మేరకు ట్యాక్స్‌లను తగ్గించాలి. రాష్ట్రంలోని 9 చోట్ల రాష్ట్ర తునికాకు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కు చెందిన వాళ్లే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.
కే .రమేశ్, తునికాకు కాంట్రాక్టర్, కొత్తగూడ, మహబూబాబాద్జిల్లా