భద్రాద్రి డెవలప్​మెంట్ కోసం స్థల సేకరణ : హన్మంతరావు

భద్రాద్రి డెవలప్​మెంట్ కోసం స్థల సేకరణ : హన్మంతరావు
  •  భూ నిర్వాసితులతో ఎండోమెంట్ ​కమిషనర్​ హన్మంతరావు చర్చలు

భద్రాచలం, వెలుగు :  తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం డెవలప్​మెంట్​పై దృష్టి సారించింది. అభివృద్ధికి  అవసరమైన భూమిని ఆలయం చుట్టూ ఉన్న ఇంటి యజమానుల నుంచి సేకరించాల్సి ఉంది. దీని కోసం ఎండోమెంట్ కమిషనర్​ హన్మంతరావు భూ నిర్వాసితులతో బుధవారం వరుసగా రివ్యూ మీటింగ్​లు నిర్వహించారు. అంతకుముందు రెవెన్యూ ఆఫీసర్లతోనూ భేటీ అయ్యారు. ఆలయం చుట్టూ ప్రాకారాల నిర్మాణం కోసం అవసరమయ్యే భూమి గురించి  చర్చించారు. కమిషనర్​ హన్మంతరావు, ఆర్కిటెక్ట్​​ సూర్యనారాయణమూర్తి, అడిషనల్ కలెక్టర్​ వేణుగోపాల్, ఆర్డీవో దామోదర్, దేవస్థానం ఈవో రమాదేవి ఆలయ పరిసరాల్లో ఉండే ఇళ్ల యజమానులతో విడివిడిగా భేటీ అయ్యారు. 

కమిషనర్ ​ముందు ఏకరవు..

గతంలో మాడవీధుల డెవలప్​మెంట్ కోసం 27 ఇళ్లను తొలగించాల్సి వచ్చింది. అందులో 19 మంది నుంచి మాత్రమే భూమిని సేకరించారు. మిగతా ఏడు ఇళ్లవారు మాత్రం ముందుకు రాలేదు. వీరికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. వెనక్కు జరిపి ఇళ్లు కట్టుకున్న 19 మందితో కూడా మాట్లాడారు. గజానికి గతంలో రూ.10వేల నుంచి రూ.12వేల వరకు, ఆర్​ అండ్​ బీ లెక్కల ప్రకారం ఇంటి నష్టం ఇచ్చారని వారు వివరించారు. ఇంటి కోసం వేరే ప్రాంతంలో స్థలం కేటాయిస్తామని, దేవస్థానంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, తర్వాత మరిచిపోయారని వారు వాపోయారు.

ఈసారి ఆ తప్పులు పునరావృతం కాకుండా తమ డిమాండ్లు నెరవేర్చాలని కమిషనర్​ ముందు ఏకరవు పెట్టుకున్నారు. అయితే ఈసారి గజానికి రూ.16వేల నుంచి రూ.18వేల వరకు ఇచ్చే ప్రతిపాదనతో పాటు, ఆర్​అండ్​బీ శాఖ నిర్ణయించిన మేరకు ఇంటికి నష్టపరిహారం  ఇస్తామని వారికి వివరించారు. భూసేకరణ చట్టంలో ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలనే నిబంధన లేదని, అలా ఇవ్వలేమని ఎండోమెంట్ కమిషనర్​ తెగేసి చెప్పినట్లు  తెలిసింది. 

రెండు ఎకరాలు అవసరం.. 

ప్రస్తుతం మాస్టర్​ ప్లాన్ అమలు కోసం కనీసం రెండు ఎకరాల భూమి అవసరం ఉంటుంది. అంటే 50 ఇళ్లను తొలగించాల్సి ఉంది. మిగిలిన వారితో కూడా ఆఫీసర్లు మీటింగ్​ పెట్టి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి ఇవ్వాల్సిందేనని, అందుకు ఇంటి యజమానులు సిద్ధపడాలని కమిషనర్​ సూచించారు. భూసేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇస్తామని వారికి నచ్చజెప్పారు. భూ యజమానులు చెప్పిన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా భూ యజమానులతో మీటింగ్​కు ఇతరులను అనుమతించలేదు. కమిషనర్​ హన్మంతరావు ఆలయంలో మాట్లాడుతూ మాస్టర్​ ప్లాన్​, టెంపుల్ డెవలప్​మెంట్​ గురించి చర్చించామని వివరించారు.

Also Read : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ధర్మపురి ఎమ్మెల్యే సాగ్వతం

ఆలయంలో పూజలు

మీటింగ్​ అనంతరం బుధవారం రాత్రి కమిషనర్​ హన్మంతరావు ఇతర అధికారులు ఆలయంలో పూజలు చేశారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు వారికి స్వాగతం పలికారు. పూజలనంతరం వారికి ఆశీర్వచనం, ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.