హైదరాబాద్, వెలుగు: సర్కారు యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్నేండ్లుగా వివిధ కారణాలతో ఆగిపోయిన ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. వర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకం, ప్రమోషన్ల ప్రక్రియలోని సమస్యలను అధిగమించేందుకు ముగ్గురు వీసీలతో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్ గా, ఓయూ వీసీ కుమార్, ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ ను సభ్యులుగా నియమించారు.
ఖాళీల భర్తీకి త్వరగా రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా కొత్త గైడ్ లైన్స్ ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఈ కమిటీ మూడు వారాల్లో తన నివేదికను సమర్పించనుంది. ఆ నివేదికను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు సర్కారుకు పంపించనున్నారు. కాగా.. రాష్ట్రంలోని 12 సర్కారు వర్సిటీలు ఉండగా, వాటిలో మొత్తం 2,825 టీచింగ్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 873 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వర్సిటీల్లో కొన్నింటిలో రెగ్యులర్ ప్రొఫెసర్లు కూడా లేరు.
వర్సిటీల బలోపేతానికి కృషి చేద్దాం: శ్రీధర్
రాష్ట్రంలోని సర్కారు వర్సిటీల బలోపేతానికి అందరూ కృషి చేద్దామని వీసీలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ తెలిపారు. శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డితో కలిసి శ్రీధర్ వర్సిటీ వీసీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే కాకుండా పరిశ్రమల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్స్ వినియోగించుకోవాలని సూచించారు.