వెయ్యి కోట్లు ఇస్తామన్నరు.. ఒక్క పైసా ఇయ్యలే

  • వెయ్యి కోట్లు ఇస్తామన్నరు.. ఒక్క పైసా ఇయ్యలే
  • భద్రాచలంలో వరద నివారణ చర్యలు మరిచిన ప్రభుత్వం
  • హామీ ఇచ్చి ఏడాదైనా ఇప్పటివరకు అతీగతీ లేదు​
  • కమిటీలతో కాలయాపన చేస్తున్నారని స్థానికుల ఆరోపణ
  • వరద ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో అందని పరిహారం
  • వానా కాలం ఎట్లా గడుస్తదోనని  పరివాహక ప్రాంత ప్రజల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం,  వెలుగు : ‘‘భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినం.. వరద ముంపు బాధితులకు పర్మినెంట్ ఇండ్లు కట్టించి ఇస్తాం.. భద్రాచలం పట్టణ కాంటూర్​ లెవెల్స్​పరిగణలోకి తీసుకుంటం.. కరకట్ట ప్రాంతంలోని నివాసాలను కూడా తరలిస్తాం.. ఇందుకు రూ. వెయ్యికోట్లు ఖర్చు చేస్తాం..”అని నిరుడు ఇయ్యాల్టి రోజు(జులై 17) సీఎం కేసీఆర్​ భద్రాచలంలో  పర్యటించి గోదావరి వరద ముంపు బాధితులకు హామీ ఇచ్చారు. అయితే ఏడాదైనా రూ. వెయ్యి కోట్ల జాడే లేకుండా పోయింది.  కరకట్టల నిర్మాణాలు కమిటీలకే పరిమితమయ్యాయి. 

90 అడుగుల వరద వచ్చినా.. 

కనీవిని ఎరుగని రీతిలో  నిరుడు జులై 15వ తేదీ నాటికి  భద్రాచలం వద్ద గోదావరి 71.3 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం పట్టణంతో పాటు భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి.  వేలాది ఇండ్లు వరద నీటిలో మునిగాయి. భద్రాచలం, బూర్గంపహడ్​, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం,  మణుగూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్​జులై 17న భద్రాచలంలో పర్యటించారు. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులతో వరదలపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 90 అడుగులకు వచ్చినా ఇబ్బందులు రాకుండా ముంపు బాధితులకు 2 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.  రూ.వెయ్యికోట్లతో  వరద నివారణ చర్యలకు ప్లాన్​ చేస్తామని భరోసా ఇచ్చారు. 

సీతమ్మ సాగర్​ బ్యారేజ్​ వల్ల  దుమ్ముగూడెం మండలం పర్ణశాల ఆలయంతో పాటు కొన్ని గ్రామాలు మునుగుతున్నాయని, వెయ్యి కోట్ల ప్రాజెక్ట్​లో భాగంగా అక్కడ కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం హామీ  ఇచ్చారు.  బూర్గంపహడ్​కు కూడా కరకట్ట విషయమై పరిశీలిస్తామన్నారు. భద్రాచలం చుట్టూ కరకట్టల పొడిగింపు విషయంలో పక్కన గల ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంతో కూడా మాట్లాడతామని తెలిపారు. 

కరకట్ట కట్టాల్సిందే..

సీఎం మాటలకు ఏడాది గడిచినా అమలు మాత్రం  లేదు.  కరకట్ట, ఇతరత్రా వరద ముంపు చర్యలపై  ఇరిగేషన్​ ఆఫీసర్లతో ప్రభుత్వం కమిటీ వేసింది.  ఐదారు నెలల కింద కమిటీ ఇందుకు సంబంధించి ఫీల్డ్​ వర్క్​ చేసింది. ప్రైమరీ రిపోర్ట్​ను రూపొందించింది. డిటైల్డ్​ఇన్విస్టిగేషన్​ చేయాల్సి ఉండగా ఇంత వరకు జాడ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా భద్రాచలంలోని  వరద ముంపు బాధితుల కోసం  డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి  పట్టణంలోని మార్కెట్ యార్డ్​లో  దాదాపు 16 ఎకరాలకు పైగా ల్యాండ్​ చూశారు. 

ఇప్పటికే  కట్టిన డబుల్​ బెడ్రూంలకు చెందిన 150 ఇండ్లను వరద ముంపు బాధితులకు ఇచ్చేందుకు ముందుకొచ్చినా బాధితులు ఇంట్రస్ట్​ చూపడం లేదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కరకట్ట కట్టాలని అంటున్నారని ఆఫీసర్లు చెప్తున్నారు.  ఎంతో ఇష్టపడి కట్టుకున్న విలువైన ఇండ్లను వదిలి ఇరుకైనా డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి ఎట్లా పోవాలని బాధితులు  వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కరకట్ట, ఇతరత్రా వరద ముంపు నివారణ చర్యలు చేపడితే తాము కట్టుకున్న ఇండ్లలోనే ఉండగలుగుతామని బాధితులు పేర్కొంటున్నారు. మరో వైపు వరద ముంపు బాధి తులకు సీఎం ప్రకటించిన  రూ. 10వేల ఆర్థిక సాయం పూర్తి స్థాయిలో అందలేదు. ఒక్క బూర్గంపహడ్​లోనే దాదాపు వెయ్యి మందికి పైగా పరిహారం రాలేదు.  పరిహారం విషయంలోనూ బీఆర్​ఎస్​ నేతలు  చెప్పిన వారికే ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. 

ALSO READ :ఆటోలో డబ్బుల బ్యాగు మర్చిపోయిన్రు.. 

కమిటీల పేరుతో కాలయాపన..

ప్రభుత్వం కరకట్ట, ఇతరత్రా వరద ముంపు నివారణ చర్యలపై కమిటీ వేసి చేతులు దులుపుకుంది. బూర్గంపహడ్​ వైపు కరకట్టల గురించి ఆఫీసర్లు మాట్లాడడం లేదని ఆ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. కమిటీల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈనెల, వచ్చే నెలలో గట్టివానలు కొడితే  తమ బతుకెట్లా అని గోదావరి పరివాహ ప్రాంతాల ప్రజలు ఉలిక్కి పడ్తున్నారు. ఎప్పుడేం జరగుతుందోనని భయపడిపోతున్నారు. అలాగే భద్రాచలం ఆలయ అభివృద్ధిని కూడా సీఎం కేసీఆర్​ మరిచిపోయారని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు. 

సీఎంవి మాటలే కోటలు.. 

గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాలు,  పంట నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్​ వచ్చి సరిగ్గా ఏడాదైంది.   కరకట్టలు, ఇతరత్రా వరద ముంపు నివారణ చర్యలకు రూ. వెయ్యి కోట్లు శాంక్షన్​ చేస్తామన్నరు..  ఇయ్యాల్టి వరకు ఒక్క పైసా ఇయ్యలె..  ఒక్క పని చేపట్టలే. వరదల టైంలోనే మరోసారి వస్తానని, టెంపుల్​ అభివృద్ధితో పాటు బూర్గంపహడ్​ వైపు కరకట్టల నిర్మాణాలను పరిశీలిస్తానని చెప్పి అటే పోయిన్రు. కేసీఆర్​ మాటలతో కోటలు కట్టడం తప్ప ఏం డెవలప్​మెంట్​ఉండదు. 

- పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే

కమిటీ ప్రణాళికలు తయారుచేస్తోంది..

వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ఇరిగేషన్​ ఆఫీసర్లతో కమిటీ వేశారు. ఇప్పటికే కమిటీ ప్రాథమిక నివేదిక తయారు చేసింది. డిటైల్డ్​ ఇన్విస్టిగేషన్​ రిపోర్టు తయారు చేయాల్సి ఉంది.  భవిష్యత్​లో ముంపును ఎదుర్కొనేలా ప్రణాళికలను కమిటీ రూపొందిస్తోంది. 

- వెంకటేశ్వరరెడ్డి, ఎస్ఈ, ఇరిగేషన్