- రెండు మెగావాట్ల వరకు ప్లాంట్ ఏర్పాటుకు చాన్స్
- రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మెగావాట్లకు గ్రీన్ సిగ్నల్
- ఉత్పత్తి చేసే కరెంట్‌ను సర్కారే కొంటుంది
- కేంద్ర పథకం పీఎం కుసుమ్ అమలుకు శ్రీకారం
- రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ భూముల్లో పంటల సాగుతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈమేరకు ‘ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్)’ పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయాలని నిర్ణయించింది. రైతులే సొంతంగా గానీ, ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం, కంపెనీ భాగస్వామ్యంతో గానీ పొలంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పొలాల్లో 4 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యమున్న సోలార్ పవర్ ప్లాంట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే (2025 మార్చి31) లోగా ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ పథకం అమలుకు ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’ (టీజీ రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. కేంద్రం రెనవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. డిస్కంల సమన్వయంతో ఆసక్తిగల రైతుల ఎంపికకు టీజీ రెడ్కో దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
2 మెగావాట్ల వరకు ప్యానెల్స్..
రైతులు తమ పంట పొలాల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం వరకు సోలార్ ప్యానెల్‌తో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తున్నది. రాష్ట్రంలోని రైతులకు చెందిన సాగుకు అనుకూలంగా లేకుండా ఎండిపోయిన, పాడుబడిన వ్యవసాయ, బీడు భూముల్లో ఈ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకంలో రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు కూడా ఇచ్చుకోవచ్చు. పంట పొలాల్లో ఏర్పాటు చేసే ఈ సోలార్ ప్లాంట్లు ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును కిలో వాట్పర్ హవర్ కు ధర రూ.3.13 చొప్పున ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించింది. ఈ సోలార్ ప్లాంట్ల నుంచి 25 ఏండ్ల పాటు డిస్కంలు కరెంటు కొనుగోలు చేస్తాయి.
రైతులకు అదనపు ఆదాయ మార్గాలు సృష్టించడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
పంట పొలాల్లో సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతులకు అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు డిప్యూటీ సీఎం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకాన్ని రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ పథకంతో ఒకవైపు పర్యావరణ అనుకూలమైన, కాలుష్య రహిత కరెంట్ఉత్పత్తితో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.
భూమి యజమానికి, డెవలపర్లకు మధ్య డిస్కమ్ లతో జరిగే ఒప్పంద మేరకు లీజు మొత్తాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు. రైతులు, రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు, వాటర్ యూజర్ అసోసియేషన్లు సైతం ఈ పథకం కోసం దరఖాస్తు చేయవచ్చన్నారు. తెలంగాణ రెడ్ లోఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. రెడ్కో లిస్టులో పేర్కొన్న సమీప సబ్ స్టేషన్ లను ఎంపిక చేసుకొని దాని పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.