- రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో నిర్మాణం
- త్వరలో టెండర్లు పిలవనున్న ఆర్ అండ్ బీ
హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ లోని 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ. 2583 కోట్లు మంజూరు చేస్తూ లా సెక్రటరీ తిరుపతి ఇటీవల జీవో కూడా జారీ చేశారు. మొత్తం నిధుల్లో రూ.1980 కోట్లు సివిల్ పనులకోసం, మరో రూ. 603 కోట్లు పలు రకాల పనుల కోసం ఖర్చు చేయనున్నారు.
కొత్త హైకోర్టు భవనం డిజైన్, డీపీఆర్ ను వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ ప్రభుత్వానికి అందచేయగా గత నెలలోనే ఆమోదించింది. అంతకుముందు పలు డిజైన్లు ఖరారు చేయగా ఆర్ అండ్ బీ అధికారులు, కన్సల్టెంట్ ప్రతినిధులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని జడ్జిల కమిటీకి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు. ఇందులో పలు మార్పులు చేయాలని సూచించారు. అదే విధంగా దేశంలో ఈ మధ్య నిర్మించిన కొత్త హైకోర్టులను పరిశీలించాలని జడ్జిల కమిటీ సూచించగా ఆర్ అండ్ బీ అధికారులు జార్ఖండ్ హైకోర్టును పరిశీలించారు.
టెండర్లకు ఏర్పాట్లు
రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో నిర్మించనున్న కొత్త హైకోర్టు బిల్డింగ్ నిర్మాణానికి త్వరలో ఆర్ అండ్ బీ టెండర్లు పిలవనుంది. ప్రస్తుత హైకోర్టు వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఉంటుండంతో జడ్జీలు, లాయర్లు, పబ్లిక్ కోర్టుకు రావటం పెద్ద సమస్యగా మారింది. గతంలోనే కొత్త హైకోర్టు నిర్మించాలని అనుకోగా ఇప్పుడు ముందుకు పడిందని లాయర్లు చెబుతున్నారు. ఆడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇవ్వటంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో టెండర్లు పిలవనున్నారు.
రెండేండ్లల్లో హైకోర్టు నిర్మాణం పూర్తి చేసేలా.. టెండర్ దక్కించుకున్న కంపెనీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించనుందని అధికారులు చెబుతున్నారు. కొత్త హైకోర్టు భవనంలో జడ్జిలకు నివాస భవనాలు, బార్ కౌన్సిల్ ఆఫీసు, అడ్వకేట్లకు లైబ్రరీ, పోలీసు, సెక్యూరిటీ సిబ్బిందితో పాటు మొత్తం 40 బిల్డింగులు నిర్మించనున్నారు. అన్ని పరిశీలనల తర్వాత ఫైనల్ డిజైన్ ఖరారు చేశారు.