కరీంనగర్ జిల్లాలో సాగునీటికి పెద్దపీట .. బడ్జెట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నిధులు

కరీంనగర్ జిల్లాలో సాగునీటికి పెద్దపీట .. బడ్జెట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నిధులు
  • శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ఫ్లడ్ కెనాల్ కు రూ. 548 కోట్లు  
  • కరీంనగర్ స్మార్ట్ సిటీకి రూ.101 కోట్లు 
  • శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు 
  • చిన్న కాళేశ్వరం, మానేరు రివర్ ఫ్రంట్‌‌కు ఫండ్స్ నిల్ 

కరీంనగర్, వెలుగు: బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు విద్య, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. శ్రీపాద ఎల్లంపల్లి రూ.249 కోట్లు, ఎస్సారెస్పీ వరద కాల్వకు రూ.299 కోట్లు కేటాయించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కేటాయించిన నిధులతో పెండింగ్ లో ఉన్న స్టేజీ 2 పనులు పూర్తయ్యే అవకాశముంది. 

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ టు ఫేజ్ వన్ పనులు త్వరితగతిన పూర్తిచేసి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో 1,51,400 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ నిధులు కేటాయించింది.  మంథని నియోజకవర్గ రైతులకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈ బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 

శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు..

గత సర్కార్ హయాంలో నిధుల్లేక నిర్లక్ష్యానికి గురైన శాతవాహన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ పరిధిలో ఎంఫార్మసీ కోర్సుకు కూడా అనుమతులు లభించాయి. కొత్త కాలేజీల బిల్డింగ్స్ నిర్మాణం కోసం ఈ నిధులు ఖర్చు చేసే అవకాశముంది. 

కరీంనగర్ స్మార్ట్ సిటీకి రూ.101 కోట్లు

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌‌గా రూ.101 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మొత్తంలో నిధులు విడుదల చేయనుంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఇంకా 14 పనులు నిర్మాణంలో ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టు మాత్రం టెండర్ దశలోనే ఉంది. 

మానేరు రివర్ ఫ్రంట్ కు నోఫండ్స్.. 

మానేరు రివర్ ఫ్రంట్ కు రాష్ట్ర  బడ్జెట్‌‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు.  ఇప్పటికే లైట్లు వేయకపోవడం, మెయింటనెన్స్ లేకపోవడంతో  రూ.183 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కళ తప్పింది.  కేబుల్ బ్రిడ్జిపై వేసిన తారు అనేకసార్లు కొట్టుకుపోవడం, గుంతలు ఏర్పడడంతో బ్రిడ్జి నిర్మాణ పనులపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులపై విజిలెన్స్  ద్వారా ఎంక్వైరీ చేయించినప్పటికీ.. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

 ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.800 కోట్లు. గత ప్రభుత్వం రూ.310 కోట్లు, మరోసారి రూ. 234 కోట్లు కేటాయించింది. మొత్తంలో రూ.545 కోట్లకుపైగా విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు రూ.300 కోట్ల మేర ఖర్చయినట్లు తెలిసింది. మిగతా నిధులు ఇంకా ఖర్చు చేయలేదు. వీటికితోడు కేంద్రం టూరిజం శాఖ నుంచి మరో  రూ.100 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.  

స్పోర్ట్స్ స్కూల్ కు రూ.20 కోట్లు.. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వరంగల్, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూళ్లకు కలిపి రూ.41 కోట్లు కేటాయించింది. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ కు రూ.20 కోట్ల మేర కేటాయించే అవకాశముంది. కనీస సౌకర్యాలు లేక అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు బడ్జెట్ ఊరటనిస్తోంది. గతంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ స్కూల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని బడ్జెట్ లో నిధుల కేటాయింపులకు చొరవ తీసుకున్నారు.