మహిళా సంఘాల చీరల ఆర్డర్లూ.. సిరిసిల్ల నేతన్నలకే..

మహిళా సంఘాల చీరల ఆర్డర్లూ.. సిరిసిల్ల నేతన్నలకే..
  • 4.24 కోట్ల మీటర్ల క్లాత్‌‌‌‌ను ఉత్పత్తి చేయాలని ఆర్డర్‌‌‌‌ కాపీని అందజేసిన ఆఫీసర్లు
  •  క్లాత్‌‌‌‌ తయారీకి ఏప్రిల్‌‌‌‌ 30 డెడ్‌‌‌‌లైన్‌‌‌‌
  • నేత కార్మికులకు ఎనిమిది నెలల పాటు దొరకనున్న ఉపాధి
  • గతంలోనే స్కూల్‌‌‌‌ యూనిఫామ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ను ఇచ్చిన ప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల నేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి ఏడాదంతా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో స్కూల్‌‌‌‌ యూనిఫామ్‌‌‌‌ ఆర్డర్లను ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల తయారీ ఆర్డర్‌‌‌‌ను సైతం సిరిసిల్ల కార్మికులకే అప్పగించింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌‌‌‌ కాపీని టెస్కో జీఎం అశోక్‌‌‌‌రావు సోమవారం సిరిసిల్ల చేనేత జౌళిశాఖ ఏడీ సాగర్‌‌‌‌కు అందజేశారు. 

4.24 కోట్ల మీటర్ల క్లాత్‌‌‌‌కు ఆర్డర్‌‌‌‌.. ఏప్రిల్‌‌‌‌ 30 డెడ్‌‌‌‌లైన్‌‌‌‌

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘ఇందిరా మహిళా శక్తి’ స్కీమ్‌‌‌‌ కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ చీరలకు సంబంధించిన క్లాత్‌‌‌‌ ఉత్పత్తి బాధ్యతను సిరిసిల్లలోని నేత కార్మికులకు అప్పగించింది. మొదటి విడత కింద 4.24 కోట్ల మీటర్ల క్లాత్‌‌‌‌ను తయారు చేయాలని సూచించింది. ఈ క్లాత్‌‌‌‌ ఉత్పత్తిని ఏప్రిల్‌‌‌‌ 30 వరకు పూర్తి చేయాలని డెడ్‌‌‌‌లైన్‌‌‌‌ విధించింది. మే మొదటి వారంలో క్లాత్‌‌‌‌ను ప్రభుత్వం ప్రొక్యూర్‌‌‌‌ చేసి ప్రింటింగ్‌‌‌‌, ప్రాసెసింగ్‌‌‌‌ కోసం హైదరాబాద్‌‌‌‌కు తరలించనున్నారు. అక్కడ ప్రింటింగ్‌‌‌‌ ప్రక్రియ రెండు నెలల పాటు సాగనుంది. జూన్‌‌‌‌ లేదా జూలై కల్లా చీరలు రెడీ అవుతాయని చేనేత, జౌళి శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.

యారన్‌‌‌‌ వేములవాడ నుంచే...

మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వనున్న చీరల తయారీకి అవసరమైన యారన్‌‌‌‌ను వేములవాడ నుంచే సరఫరా చేయనున్నారు. రూ. 50 కోట్లతో వేములవాడలో గతేడాది అక్టోబర్‌‌‌‌లో ప్రభుత్వం యారన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే సిరిసిల్ల నేతన్నలకు యారన్‌‌‌‌ సరఫరా చేయనున్నారు. బతుకమ్మ చీరల క్లాత్‌‌‌‌ ఉత్పత్తి చేసే టైంలో కార్మికులు బడా వస్త్రవ్యాపారుల దగ్గర యారన్‌‌‌‌ తెచ్చుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వమే యారన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఏర్పాటు చేయడంతో నేతన్నలు డైరెక్ట్‌‌‌‌గా దారం తెచ్చుకొని క్లాత్‌‌‌‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది.

95 శాతం ఆర్డర్లు సిరిసిల్లకే...

తెలంగాణ వ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా సిరిసిల్లలోనే అత్యధికంగా 21 వేల పవర్‌‌‌‌లూమ్స్‌‌‌‌ ఉన్నాయి. ఇక్కడ వస్త్ర పరిశ్రమపై ఆధారపడి 6 వేల మంది కార్మికులు, 3 వేల మంది అనుబంధ రంగాల కార్మికులు, 1600 మంది ఆసాములు జీవిస్తున్నారు. కొన్నేండ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడడం, ఇక్కడి కార్మికులకు ఏడాదంతా పని కల్పించేందుకు ప్రభుత్వం వరుసగా ఆర్డర్లు ఇస్తోంది. ప్రభుత్వం తరఫున మహిళలకు అందజేసే చీరల్లో 95 శాతం సిరిసిల్ల నేతన్నలే తయారు చేస్తుండడం గమనార్హం. 

మరో వైపు గత ప్రభుత్వం పెండింగ్‌‌‌‌ పెట్టిన బకాయిలను సైతం ప్రస్తుత ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు రూ. 222 కోట్లను గతంలోనే విడుదల చేసింది. అలాగే రంజాన్‌‌‌‌, సర్వశిక్ష అభియాన్‌‌‌‌, హర్‌‌‌‌ ఘర్‌‌‌‌ తిరంగాతో పలు ఆర్డర్లకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇవ్వాల్సిన మొత్తం రూ. 379 కోట్లు, ఇతర ప్రాంతాలకు ఇచ్చిన ఆర్డర్ల బకాయిలు రూ. 121 కోట్లతో కలిసి మొత్తం వస్త్ర పరిశ్రమకు రూ. 500 కోట్లను విడుదల చేసింది.

నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చాం

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఇస్తామన్న చీరల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకే ఇచ్చాం. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మొదటి విడతలో 65 లక్షల చీరలకు కావాల్సిన 4.24 కోట్ల మీటర్ల క్లాత్‌‌‌‌ను తయారు చేయాలని చెప్పాం. మిగతా ఆర్డర్‌‌‌‌ను సైతం త్వరలోనే ఇస్తాం. ఈ చీరల తయారీతో సిరిసిల్ల నేతన్నలకు సుమారు ఎనిమిది నెలల పాటు పని దొరుకుతుంది.

 – అశోక్‌‌‌‌రావు, టెస్కో జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌

రేవంత్‌‌‌‌రెడ్డికి రుణపడి ఉంటాం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలను విడుదల చేసింది. ఇప్పుడు చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు పని కల్పిస్తోంది. దీంతో నేత కార్మికులకు పని దొరకడంతో ఆత్మహత్యలు ఆగుతాయి. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి రుణపడి ఉంటాం. 

 – ఆడెపు భాస్కర్‌‌‌‌, సిరిసిల్ల పాలిస్టర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు