హైదరాబాద్: బీసీ కుల గణనపై తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 60 రోజుల్లోనే కుల గణన కంప్లీట్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కుల గణన బాధ్యతలు ఇప్పటికే ప్లానింగ్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కుల గణన సర్వే ప్రాసెస్ షూరు చేస్తున్నారు.
సామాజిక, ఆర్థిక, విద్య ఉద్యోగ, రాజకీయ అంశాలపై సర్వే నిర్వహించనున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీ సంఘాల నేతలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కుల గణనకు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
కాగా, ప్రస్తుతం తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పాలన ముగిసింది. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. గ్రామ పంచాయతీల పాలన కాలం ముగిసి దాదాపు ఆరేడు నెలలు కావడంతో వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజ్వరేషన్లు 42 శాతం పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఇచ్చిన హామీ మేరకు బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకోసమే బీసీ కుల గణన పూర్తి అయిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బీసీ కుల గణన ప్రాసెస్‌ను అధికారులు స్పీడప్ చేశారు. 60 రోజుల్లో సర్వే రిపోర్ట్ సమర్పించాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు రెడీ అయ్యారు.