ఇంజినీరింగ్ సీట్లు.. మరో 14 వేలు

  • ప్రైవేట్ కాలేజీల్లో భారీగా పెంచుతూ సర్కార్ జీవో 
  • సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో సీట్లు పెంపు 
  • సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో కోత
  • ఎంసెట్ కౌన్సెలింగ్​ షెడ్యూల్​లో మార్పులు 

హైదరాబాద్, వెలుగు : ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లను రాష్ట్ర సర్కార్ భారీగా పెంచింది. ఈ విద్యాసంవత్సరంలో ఏకంగా14,565 సీట్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల మేనేజ్ మెంట్లు సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని.. సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి. సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ తగ్గుతుండడంతో ఆ సీట్లను మేనేజ్ మెంట్లు తగ్గించుకుంటున్నాయి. మరో మూడు నాలుగేండ్లలో ఆ కోర్సులను పూర్తిగానే ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 165 ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీలు పర్మిషన్ ఇవ్వగా.. వాటిల్లో 66,112 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. అయితే సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో సీట్లు తగ్గించుకున్న మేనేజ్ మెంట్లు.. సీఎస్ఈ, ఐటీ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లు పెంచాలని వర్సిటీలను కోరాయి. ఇందుకోసం ఏఐసీటీఈ నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నాయి. దీంతో వర్సిటీలు పర్మిషన్ కోరుతూ సర్కార్ కు లెటర్ రాయగా, ప్రభుత్వం సీట్ల పెంపునకు ఓకే చెప్పింది. 14,565 సీట్లను పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీవో నంబర్ 114 విడుదల చేశారు. 

అయితే వీటిలో ఇప్పటికే ఉన్న 6,930 సీట్లను మేనేజ్ మెంట్లు తగ్గించుకుని.. వాటి స్థానంలో ఇతర కోర్సుల సీట్లు తెచ్చుకున్నాయి. ఇక కొత్తగా 7,635 సీట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ లెక్కన మొత్తం 14,565 సీట్లు పెరగనుండగా, వీటిలో 10 వేలకు పైగా (70%) కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. పెరిగిన సీట్లన్నీ దాదాపు సీఎస్ఈ, ఐటీ కోర్సులవే ఉన్నాయి. కాగా, సీట్ల పెంపునకు సర్కార్ పర్మిషన్ ఇవ్వగా.. కాలేజీల్లో సౌలతులకు అనుగుణంగా వర్సిటీలు మరోసారి 
అనుమతి ఇవ్వాల్సి ఉంది.  

కౌన్సెలింగ్​ షెడ్యూల్ లో మార్పు.. 

ఇంజినీరింగ్​కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 10 వేలకు పైగా సీట్లు పెరగడంతో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్​లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. ఇప్పటికే 70వేలకు పైగా స్టూడెంట్లు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, శనివారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. 12న సీట్ల కేటాయింపు ఉండాలి. 
కానీ, సీట్లు పెరగడంతో పాటు ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు త్వరలోనే రానుండడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ ను మార్చారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. 

దీని ప్రకారం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా ఈ నెల 7, 8 తేదీల్లోనూ రిజిస్ర్టేషన్, ఫీజు పేమెంట్ తో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ కు చాన్స్ ఇచ్చారు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 12 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 16న సీట్ల కేటాయింపు ఉంటుంది. 22లోగా సెల్ఫ్
 రిపోర్ట్ చేయాలి. 

ALSO READ:తీన్మార్ వార్తలు | కేసీఆర్ - మైండ్ గేమ్ | మోడీ వరంగల్ మీటింగ్ - కేసీఆర్ దాటవేస్తారా?

ఇదీ మారిన షెడ్యూల్

సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం ఈ నెల 24, 25 తేదీల్లో ఆన్ లైన్ రిజిస్ర్టేషన్లు, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 31న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 2 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇక ఫైన‌‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం ఆగస్టు 4న ఆన్ లైన్ రిజిస్ర్టేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 5న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 4 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 9న సీట్ల కేటాయింపు ఉంటుంది. 11లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.