
- రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన
- జిల్లాలవారీగా ఫ్లెక్సీలకు టెండర్లు
- ఒక్కో గ్రామంలో మూడు చొప్పున ఏర్పాటు
- మాఫీ జరగలేదన్న ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ గా సర్కారు నిర్ణయం
యాదాద్రి, వెలుగు: రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లతో జాబితాలు రూపొందించి గ్రామాల్లోని మూడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్లెక్సీలు ప్రింట్ చేయించేందుకు జిల్లాలవారీగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో ఫ్లెక్సీని 6x3 సైజ్ లో ప్రింట్ చేయించనున్నారు. జీఎస్టీ తో కలిపి ఒక్కో ఫ్లెక్సీ ధర రూ.350కి మించొద్దని నోటిఫికేషన్ లో షరతు విధించారు.
25.35 లక్షల మంది రైతులకు రూ.,20,617 కోట్ల రుణమాఫీ..
అప్పుల బాధల్లో ఉన్న రైతులను రుణవిముక్తులను చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల్లోపు క్రాప్ రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నాలుగు విడతల్లో కలిపి 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసింది. ఈ రైతులందరి వివరాలు ఫ్లెక్సీల్లో ముద్రించనున్నారు. రుణమాఫీ పొందిన కొందరు మఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు తమకు కూడా మాఫీ కాలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
లబ్దిదారుడి పేరుతోపాటు పూర్తివివరాలను ఫ్లెక్సీలో ప్రింట్ చేయడం ద్వారా ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సర్కారు భావిస్తోంది. రైతు భరోసా స్కీమ్ ను ఈ ఏడాది జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎకరానికి 6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు సాయంగా రైతులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు మూడు ఎకరాల్లోపు ఉన్నవారికి రైతు బంధు సాయం అందింది. ఈ నెలాఖారులోగా మిగతా రైతులందరికీ రైతు భరోసా సాయం ఇచ్చాక వారి పేర్లతోనూ ఫ్లెక్సీలు రూపొందించి ప్రదర్శించనున్నారు.
ఫ్లెక్సీల్లో రైతుల పేర్లు, రుణమాఫీ వివరాలు..
గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే ఫ్లెక్సీల్లో రుణమాఫీ అయిన రైతు పేరు, బ్యాంకు పేరు, రుణమాఫీ అయిన మొత్తం వివరాలను పొందుపరచనున్నారు. గ్రామాలన్నింటిలో వారం రోజుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా అడిషనల్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులందరికీ రైతు భరోసా చెల్లింపులు పూర్తయ్యాక ఆ లబ్ధిదారుల పేర్లతోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయధికారులు వెల్లడించారు.