
- మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు తరలించేందుకు ప్రణాళిక
- ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధంచేసిన అధికారులు
- మరో వారం రోజుల్లో టెండర్లు
- మూసీ ప్రక్షాళనకు మరికొంత నీరు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మహానగర తాగునీటి అవసరాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోదావరి రెండో దశ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, తాజాగా మూడో దశను ఒకేసారి చేపట్టేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందుకు మరో వారం రోజుల్లోనే టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ రెండు దశల పనులకు సంబంధించి వ్యాప్కోస్ అనే కంపెనీ రెడీ చేసిన డీపీఆర్ సిద్ధంగా ఉందని మెట్రోవాటర్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి మొదటి దశ నుంచి నగరానికి 160 ఎంజీడీల నీటిని అధికారులు తరలిస్తున్నారు. కరీంనగర్‌లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని గజ్వేల్ సమీపంలో మల్లారం వద్ద నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని పైప్‌లైన్‌ద్వారా శామీర్‌పేట వద్ద నిర్మించిన రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతున్నది. పెరుగుతున్న జనాభాతో పాటు గ్రేటర్ పరిధిలో మరికొన్ని ప్రాంతాలు విలీనం అవుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలకు కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూ.7,360 కోట్లతో ప్రాజెక్టు
గోదావరి ప్రాజెక్టు రెండు, మూడో దశ పనులను చేపట్టడానికి రూ. 7,360 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం అవసరమైన నిధులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చింది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మల్లన్న సాగర్ నుంచి ఘనపూర్ వరకూ 50 కి.మీ. మేరకు పైప్‌లైన్ నిర్మించనున్నారు. ఇందులో పంప్ హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు.
అంతే కాకుండా ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు దశల ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండోదశ నుంచి 150 ఎంజీడీలు, మూడోదశ నుంచి 150 ఎంజీడీల నీటిని తరలిస్తారు. తద్వారా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మేడ్చల్, కాప్రా, మల్కాజిగిరి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలకు తాగునీటి కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.
జంట జలాశయాల్లోకి మరో 5 టీఎంసీలు
గోదావరి రెండు, మూడో దశ ప్రాజెక్టులతో గ్రేటర్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా మూసీ ప్రక్షాళన కోసం కూడా కొంత నీటిని తరలించనున్నారు. అందులో భాగంగానే 5 టీఎంసీల నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర జలాశయాల్లో నింపుతారు. గోదావరి మొదటి దశలో జలాలను ఇప్పటికే మూడు రింగ్ మెయిన్ పైప్లైన్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు అందిస్తున్నారు. రెండో దశ ప్రాజెక్టులో ఘనపూర్ నుంచి నాలుగో రింగ్ మెయిన్ పైప్‌లైన్‌ను 40 కి. మీ మేరకు ముత్తంగి వరకూ నిర్మించనున్నారు. దీనిని ఇప్పటికే ఉన్న రింగ్ మెయిన్లకు అనుసంధానం చేస్తారు. దీంతో కోకాపేట, కొల్లూరు, ఐటీ కారిడార్ ప్రాంతాలకు నేరుగా గోదావరి జలాలను అందించే అవకాశం వుంది. ఇక 5 టీఎంసీల నీటిని ఘనాపూర్ నుంచి ముత్తంగి మీదుగా 22 ఎంఎం వ్యాసార్ధం కలిగిన పైప్‌లైన్ ఔటర్ రింగ్‌రోడ్ అవతలి భాగం నుంచి ముత్తంగి, కొల్లూరు, ఇంద్రారెడ్డి, కాలనీ, జన్వాడ మీదుగా జన్వాడా–ఖనాపూర్ మధ్యలో నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు నిర్మిస్తారు. ఈ పైప్‌లైన్ దాదాపు 58 కి.మీ. నిర్మించనున్నారు. ఉస్మాన్‌సాగర్ నిండిన తర్వాత హిమాయత్‌సాగర్‌ను నింపుతారు. జంటజలాశయాలు నిండిన తర్వాత నీటిని మూసీలోకి వదులుతారు.