
హైదరాబాద్: మార్చి 31న రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, బోర్డ్స్, కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ మార్చి 3 నుంచి మార్చి 31 వరకూ సాయంత్రం 4 గంటలకే ఆఫీస్ల నుంచి, స్కూళ్ల నుంచి వెళ్లిపోవచ్చని తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్లో స్పష్టం చేసింది.
రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో గడిపే ముస్లింలు రాత్రింబవళ్లూ నమాజ్‌లో లీనమై ఉంటారు. సాధారణంగా ముస్లింలు రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తుంటారు. వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రాత్రి (ఇషా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా 20 రకాతుల తరావీహ్ నమాజ్ చేస్తారు.
Telangana Government has issued an order permitting all Government Muslim Employees/Teachers/Contract /Out-sourcing/Boards/ Corporations & Public Sector Employees working in the State to leave their Offices/Schools at 4.00 pm during the Month of Ramzan from 2nd March to 31st… pic.twitter.com/bMXUpxPr3m
— ANI (@ANI) February 18, 2025
ముప్పై రోజుల దీక్షలను మూడు భాగాలుగా విభజించారు. మొదటి10 రోజుల్లో దీక్షలు పాటిస్తే అల్లా కరుణ వర్షాన్ని కురిపిస్తాడని,11 నుంచి 20 రోజులు దీక్షలు పాటిస్తే పాపాలను హరిస్తాడని, 21వ రోజు నుంచి దీక్షలను పూర్తి చేస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందని ముస్లింలు నమ్ముతారు. 21వ రోజు నుంచి చివరి రోజు వరకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఎతేకాఫ్ అంటారు. ఇది ఒక రకమైన తపోనిష్ట. దీనిని పాటించాలి అనుకునేవాళ్లు మసీదులోనే ఒక పక్క తెర కట్టుకుని అక్కడే దైవ ధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేస్తారు. ఎతేకాఫ్‌లో ఉన్నవాళ్లు బలమైన కారణం ఉంటే తప్ప మసీదు వదిలి బయటకు వెళ్లకూడదు.
రంజాన్ నెలలో ముస్లింలు ముఖ్యంగా రోజా, సహెర్, ఇఫ్తార్, తరవీహ్, ఏతేకాఫ్, షబ్–ఏ–ఖదర్, లైలతుల్ ఖద్ర్, ఫిత్రా, జకాత్ లాంటివి పాటిస్తారు. నెల రోజులపాటు తమ జీవన శైలిని పూర్తిగా మార్చుకుంటారు. 30 రోజుల ఉపవాస దీక్ష తర్వాత రంజాన్ పండుగ చేసుకుంటారు. ఉపవాసంతో పాటు దైవారాధన, దానధర్మాలు చేస్తారు. ఉపవాస దీక్ష మనిషిలో త్యాగం, కరుణ, సానుభూతి, ప్రేమను పెంచుతుంది. ఉపవాసం చేసేటప్పుడు అబద్ధం చెప్పకూడదు. అన్యాయం చేయకూడదు.