సదరం కష్టాలకు బ్రేక్ ఇక రెగ్యులర్ గా బుకింగ్స్

సదరం కష్టాలకు బ్రేక్  ఇక రెగ్యులర్ గా బుకింగ్స్
  • దివ్యాంగులకు  ఊరటనిచ్చిన ప్రభుత్వం 
  • 30న సదరం క్యాంప్ నిర్వహణ
సంగారెడ్డి, వెలుగు:  దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ కష్టాలకు బ్రేక్ పడింది. ఇకనుంచి ఎప్పుడైనా బుక్ చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో సదరం స్లాట్ బుకింగ్​ తేదీలను ప్రతీ నెల వారం రోజుల ముందు అధికారులు ఖరారు చేసేవారు. స్లాట్ నమోదు చేసుకున్న తర్వాత నిర్దేశించిన తేదీన క్యాంపునకు హాజరయ్యేవారు. 
 
బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తే స్లాట్ తక్కువగా బుకింగ్ అయ్యేవి. దీంతో చాలామంది బాధితులు స్లాట్ దొరకక రోజుల తరబడి మీసేవా కేంద్రాల చుట్టూ తిరిగే వారు. ఒక్కోసారి టెక్నికల్​సమస్యలు ఎదురైతే స్లాట్ కోసం దివ్యాంగులు మీసేవా కేంద్రాల వద్ద పడిగాపులుకాచేవారు. ఈ కష్టాలను దూరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సదరం స్లాట్ బుకింగ్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

ఇక ఎప్పుడైనా స్లాట్ బుకింగ్.. 

ఇకపై మీసేవా కేంద్రాల్లో ఎప్పుడైనా సదరం స్లాట్ నమోదు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో సదరం క్యాంపు నెలలో ఒకేరోజు మాత్రమే నిర్వహించేవారు.  స్లాట్ పొందేందుకు దివ్యాంగుడు మీ సేవా కేంద్రాల్లో ఆధార్, ఫొటో సమర్పించి బుక్​చేసుకోవాలి. తర్వాత శిబిరం నిర్వహించే తేదీ, టైం దరఖాస్తుదారుడి సెల్ ఫోన్ కు సమాచారం వస్తుంది. 

తద్వారా దివ్యాంగుడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించే క్యాంపునకు హాజరు కావాల్సి ఉంటుంది. డాక్టర్లు టెస్టులు చేసి వైకల్యం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించి వికలాంగ సర్టిఫికెట్ అందజేసేవారు. అయితే ఈ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ కోసం సదరు వ్యక్తి మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాలి. కాగా ఈనెల 30న సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంప్ నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వులపై నిర్లక్ష్యం

సదరం స్లాట్ బుకింగ్ సడలింపుపై ప్రచారం లేకుండా పోయింది. దీంతో చాలామంది దివ్యాంగులకు స్లాట్ బుకింగ్ మార్పు గురించి తెలియడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రజలకు తెలియజేయాల్సిన జిల్లా వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి సదరం స్లాట్ బుకింగ్ నిర్వహణపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని వికలాంగులు కోరుతున్నారు.