- గ్రేడింగ్ విధానానికి స్వస్తి
- 24 పేజీలతో ఆన్సర్ బుక్లెట్
- కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
- ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇంటర్నల్ మార్కుల విధానంతో పాటు గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి వంద మార్కులకూ పరీక్షలు నిర్వహించనున్నది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.రాష్ట్రంలో టెన్త్ క్లాసులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులుండగా, సైన్స్ లో మాత్రమే బయోలజీ, ఫిజిక్స్ రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ ఒక్కో సబ్జెక్టుకు వంద మార్కులు ఉండగా, దాంట్లో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తుండగా, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉండేవి.
ఈ విధానాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ఇక నుంచి వంద మార్కులకూ రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 2014 నుంచి పరీక్షల్లో సీసీఈ విధానం అమలు చేస్తున్నారు. దీంతో మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పరీక్షల విధానం తొలగించి, ఫార్మటీవ్ అసెస్మెంట్–ఎఫ్ఏ, సమ్మెటీవ్ అసెస్ మెంట్–ఎస్ఏ విధానం అమలు చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే 2015 నుంచి టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏటా జరిగే నాలుగు ఎఫ్ఏల్లో వచ్చే మార్కుల ఆధారంగా 20 ఇంటర్నల్ మార్కులను టీచర్లు కేటాయించేవారు. రాత పరీక్ష ద్వారా 80 మార్కులు ఉండేవి. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటర్నల్ మార్కుల విధానానికి బ్రేక్ పడినట్టైంది.
ALSO READ : నవంబర్ 30న సర్కారు స్కూళ్లు బంద్: ఎస్ఎఫ్ఐ
గ్రేడింగ్ విధానం బంద్
ప్రస్తుతం విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తున్నారు. ఒక సబ్జెక్టులో 90శాతానికి పైగా మార్కులు వస్తే ఏ1 గ్రేడ్ తో పాటు టెన్ జీపీఏ.. 81–90 మార్కులకు పైగా వస్తే ఏ2 గ్రేడ్.. 9 జీపీఏ, 71–80 మార్కులు వస్తే బీ 1 గ్రేడ్ తో పాటు 8 జీపీఏ... ఇలా పలు గ్రేడ్లను అలాట్ చేసే వారు. దీనివల్ల స్టూడెంట్లకు ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలిసేది కాదు. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి.. తిరిగి మార్కుల విధానాన్నే అమలు చేయనున్నారు. ఇక నుంచి స్టూడెంట్లకు వచ్చిన మార్కులను నేరుగా ప్రకటించనున్నారు.
4 పేజీల ఆన్సర్ షీట్లకు స్వస్తి
క్వశ్చన్ పేపర్ విధానంతో పాటు ఆన్సర్ విధానంలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ఎగ్జామినేషన్ సెంటర్లలో ఒక్కో విద్యార్థికి ముందుగా నాలుగు పేజీల బుక్ లెట్ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థికి అవసరమైనన్ని 4 పేజీల ఆన్సర్ షీట్లనూ అందించేవారు. దీనివల్ల స్టూడెంట్లు వాటిని జతచేయడంలో ఇబ్బందులతో పాటు కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లూ మిస్ అవుతున్న ఘటనలు సర్కారు పెద్దల దృష్టికి వచ్చాయి.
దీంతో, ఈ నాలుగు పేజీల ఆన్సర్ షీట్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి 24 పేజీల ఆన్సర్ బుక్ లేట్లనూ అందించనున్నారు. ఇక అడిషనల్ పేపర్లు ఇవ్వరు. అయితే, సైన్స్ పేపర్లు రెండు ఉండటంతో ఒక్కో పేపర్‌కు 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ అందించనున్నారు. కాగా, టెన్త్ పరీక్షా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తున్నామని గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజభాను చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి తెలిపారు. పరీక్షల నూతన విధానానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.