ఒకప్పుడు ప్రపంచస్థాయిలో పేరొందిన మన యూనివర్సిటీల పరిస్థితి నిధుల్లేక ఇప్పుడు అధ్వానంగా తయారైంది. నిధులు లేకపోవడంతో వర్సిటీల పరిస్థితి ఒక్క అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. కనీసం పెన్సిల్ కొనడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు అన్ని యూనివర్సిటీల్లోనూ కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సొంత రాష్ట్రం సాధించుకొని ఏడేండ్లయినా పర్మనెంట్ లెక్చరర్లను నియమించడం లేదు. దీంతో యూనివర్సిటీల్లో రీసెర్చ్ లు పెద్దగా జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం 80%, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 20 శాతం జీతాలు చెల్లిస్తున్న యూనివర్సిటీలన్నీ స్వయం ప్రతిపత్తితో పని చేయాల్సి ఉంటుంది. ఏ సమస్యనైనా పరిష్కరించుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి ఈ వర్సిటీలకు పూర్తి స్థాయిలో అధికారం ఉంటుంది. వైస్ చాన్స్ లర్ (వీసీ) అధ్యక్షతన ఉన్నత స్థాయి పాలకమండలి ఉంటుంది. పాలకమండలిలో తీసుకున్న ఏ నిర్ణయమైనా వీసీ పాటించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర సర్కార్ యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇన్ని రోజులు వీసీలు లేకుండానే వర్సిటీలను నెట్టుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలనే వీసీలను నియమించింది. కానీ పాలకమండలిని మాత్రం ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఖాళీ పోస్టులనూ భర్తీ చేయలేదు. దీంతో వర్సిటీల్లో బోధన, పరిశోధన నామమాత్రంగా తయారైంది. వీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది.
కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే నడుస్తున్నయ్..
20 ఏండ్ల నుంచి 25 ఏండ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేస్తున్నోళ్లే వర్సిటీలను నడిపిస్తున్నారు. కానీ వాళ్లను ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇన్నేండ్లుగా పని చేస్తున్నా, వాళ్లను రెగ్యులరైజ్ చేయడం లేదు. జీతాలు కూడా పెంచలేదు. చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్ లెక్చరర్లు కుటుంబ భారాన్ని మోస్తున్నారు. యూనివర్సిటీల్లో పర్మనెంట్ లెక్చరర్ ఒక్కరుంటే, కాంట్రాక్ట్ లెక్చరర్లు 10 మంది చొప్పున ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో సుమారు 1,600 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 2 వేల మంది రోజువారీ టెంపరరీ లెక్చరర్లు పని చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 370 మంది, జేఎన్టీయూలో 265 మంది, కాకతీయ వర్సిటీలో 182 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. క్లాసులన్నీ వీళ్లతోనే నడుస్తున్నాయి. కానీ వీళ్లకు ఉద్యోగ భరోసా లేకుండా పోయింది. వీళ్లందరూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. సమాన పనికి సమాన జీతం రావడం లేదు. పైగా పాలకులు వీరిపైన కర్ర పెత్తనం చెలాయిస్తున్నారు. పర్మనెంట్ లెక్చరర్లను కంటికిరెప్పలా కాపాడుతున్న సర్కార్.. కాంట్రాక్ట్, టెంపరరీ లెక్చరర్లపై వేటు వేయడం కరెక్టు కాదు. మరోవైపు ప్రభుత్వం ఎప్పుడూ చెప్పే ‘త్వరలోనే ఉద్యోగాల భర్తీ’ అనే ప్రకటనలు విని.. కాంట్రాక్ట్ లెక్చరర్లు, నిరుద్యోగులు ఏండ్లకేండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
భూములు కూడా అమ్ముతరేమో?
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే యూనివర్సిటీలకు గతంలో కేటాయించిన భూములు ఉంటాయా? లేక రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా అమ్ముతారా? అనే డౌట్ వస్తోంది. వర్సిటీలను స్థాపించినప్పుడు ముందుచూపుతో అప్పటి పాలకులు 200 నుంచి 600 ఎకరాల భూమిని వాటికి కేటాయించారు. భవిష్యత్తులో కొత్త కొత్త కోర్సులు వచ్చినప్పుడు, వాటికి కావాల్సిన బిల్డింగుల నిర్మాణం కోసమని ఇలా చేశారు. కానీ చాలా వరకు వర్సిటీల భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన చోట ఆక్రమించేసుకున్నారు. ఇదేంటని అడిగితే బెదిరించి నోరు తెరవకుండా చేస్తున్నారు. ప్రస్తుతం
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది.
పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేదు..
పదేండ్లుగా యూనివర్సిటీల్లో ఉద్యోగాలను భర్తీ చేయలేదు. 1992లో ఉద్యోగంలో చేరిన కొంతమంది మాత్రమే ఇప్పుడు పోస్టుల్లో ఉన్నారు. వాళ్లు కూడా ఒకట్రెండు నెలల్లో రిటైర్ కానున్నారు. రిటైర్ అవుతున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించడం లేదు. దీని ప్రభావం బోధన, పరిశోధనపై పడుతోంది. సొంత రాష్ట్రంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ, ఆ ఉద్యోగాలు మాత్రం ఇప్పటికీ భర్తీ కాలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 1,280 పోస్టులకు గాను 955 ఖాళీలు, కాకతీయలో 403కు గాను304, జేఎన్టీయూలో 410కి గాను 255 ఖాళీలు ఉన్నాయి. మిగతా అన్ని వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తంగా అన్ని వర్సిటీల్లో 2,979 పోస్టులకు గాను 2,152 ఖాళీలు ఉన్నాయి. వర్సిటీల్లో ఇన్ని సమస్యలు ఉండడంతో చాలామంది స్టూడెంట్లు ప్రైవేట్ లో చేరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో వర్సిటీలు చదువు చెప్పడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే వర్సిటీల్లో రీసెర్చ్ లు జరగడమే లేదు. యూనివర్సిటీల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. నిరుద్యోగులు కోర్టులకు వెళ్లే పరిస్థితి రాకుండా, పకడ్బందీగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. వర్సిటీలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.