9 నెలల్లో అప్పుల వడ్డీలకే రూ.20 వేల కోట్లు

9 నెలల్లో అప్పుల వడ్డీలకే రూ.20 వేల కోట్లు
  • వచ్చిన ఆదాయం రూ. 1.60 లక్షల కోట్లే
  • టార్గెట్​కు తగ్గట్టుగా లేని సర్కార్ ఆమ్దానీ కాగ్ నివేదికలో వెల్లడి
  • 2024-25లో రూ.2.74 లక్షల కోట్ల ఆదాయం అంచనా 
  • లక్ష్యం చేరాలంటే ఈ 3 నెలల్లోనే రూ.1.14 లక్షల కోట్లు కావాలి 
  • భారీగా తగ్గిన నాన్ ట్యాక్స్ ఆదాయం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు 
  • ఆదాయం ఎలా పెంచాలనే దానిపై సర్కార్ తర్జన భర్జన

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో అన్ని రకాలుగా అప్పులతో కూడా కలిపి రూ. 2.74 లక్షల కోట్ల ఆమ్దానీ వస్తుందని అంచనా వేయగా.. డిసెంబర్ నాటికి 9 నెలల్లో రూ.1.60 కోట్లు మాత్రమే వచ్చింది. టార్గెట్ చేరుకోవాలంటే ఈ జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లోనే మరో రూ.1.14 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉన్నది. తొమ్మిది నెలల్లో అప్పుల వడ్డీలకే రూ. 20 వేల కోట్లు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి గత 9 నెలల్లో వచ్చిన ఆదాయ, వ్యయాల వివరాలతో ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికను విడుదల చేసింది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం కాగ్​కు ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను పంపుతుంది. ఆ వివరాలను నివేదిక రూపంలో కాగ్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. పోయిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్ నాటికి 9 నెలల్లో వచ్చిన ఆదాయం రూ.1,000 కోట్ల వరకు తగ్గినట్టు 
రిపోర్ట్​లో తేలింది. 


దీంతో ఇప్పటివరకు ఆదాయ అంచనాల్లో 60 శాతం దాటకపోవడంతో రాబడి పెంచుకునేందుకు ఏం చేయాలనేదానిపై సర్కారు తర్జనభర్జనలు పడుతోంది. ఆదాయం తగ్గడానికి కారణాలను విశ్లేషించుకుని, తదుపరి చర్యలపై దృష్టి సారించాలని యోచిస్తోంది. అయితే, ఈ మూడు నెలల్లోనే దాదాపు 40 శాతానికిపైగా ఆదాయ అంచనాలను సర్కారు చేరుకోవడం సాధ్యమవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. 

నాన్ ట్యాక్స్ ఆదాయం, గ్రాంట్లలో భారీగా కోత 

రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో నాన్ ట్యాక్స్ రాబడి, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు భారీగా తగ్గాయి. బడ్జెట్​లో వేసిన అంచనాల్లో 25 శాతం కూడా చేరలేదు. నాన్ ట్యాక్స్ ఆదాయంలో ప్రభుత్వం భూములను అమ్మడం ద్వారా నిధులను సేకరించుకోవాలని భావించింది. కానీ భూములను సేల్ చేయకపోవడంతో తగినంత ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోయింది. దీంతో పాటు ఎల్ఆర్ఎస్, జీవో 58, 59 వంటి వాటిని కూడా  ప్రాసెస్ చేయకపోవడంతో వాటి నుంచి నాన్ ట్యాక్స్ రూపంలో రావాల్సిన రాబడి రాలేదని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాన్ ట్యాక్స్ రాబడి కింద మొత్తం రూ.35,208 కోట్లు వస్తాయని అంచనా వేయగా డిసెంబర్ నాటికి వచ్చిన మొత్తం రూ.5,487 కోట్లుగా ఉన్నది. అంటే అనుకున్న లక్ష్యంలో 15.59 శాతమే చేరుకున్నది. ఇక రాష్ట్రం చేపట్టిన వివిధ పథకాలకు కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. 2024–25లో రూ.21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయని అనుకుంటే రూ.4,771 కోట్లు అంటే 22 శాతమే వచ్చాయి. ఈ రెండింటికి సంబంధించే రూ.46 వేల కోట్లు లోటు ఉన్నది. ఈ మూడు నెలల్లోనూ పెద్దగా వచ్చేది లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అప్పులు సైతం డిసెంబర్ నాటికే పూర్తయ్యాయి. మార్చి నాటికి మొత్తం రూ.49,255 కోట్లు అప్పులు తీసుకోవాల్సి ఉండగా రూ.48,210 కోట్లు గత నెల వరకు తీసేసుకున్నారు. అదనపు అప్పుల కోసం కూడా కేంద్రంతో పాటు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  

సొంత ఆదాయం పెరగలే

పోయిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సర్కారుకు సొంత ఆదాయం కూడా పెద్దగా పెరగలేదు. పన్ను రాబడిలో గతం కంటే ఈసారి 3 శాతం తగ్గింది. జీఎస్టీ రాబడి డిసెంబర్ నాటికి రూ.37,664 కోట్లుగా ఉంది. ఇది  అనుకున్న లక్ష్యంలో 64 శాతం వచ్చింది. గతేడాది ఈ సమయానికి జీఎస్టీ రాబడి 67 శాతం నమోదైంది. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల శాఖలోనూ భారీగా ఆదాయం తగ్గింది. రూ.18,228 కోట్లు లక్ష్యం ఉండగా ఇప్పటివరకు వచ్చిన మొత్తం  రూ.10,600 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే ఈ మొత్తంలో రూ.3,046 కోట్లు లోకల్ బాడీలకు స్టాంప్ డ్యూటీని బదిలీ చేయడంతో డిసెంబర్​లో రూ.7,542 కోట్లుగానే చూపాల్సి వచ్చినట్లు కాగ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు. ఇక ఎక్సైజ్ ఆదాయం కూడా ఆశించిన రీతిలో రాలేదు. 2024–25లో రూ.25,617 కోట్లు వస్తాయని అంచనా వేయగా డిసెంబర్ నాటికి రూ.14 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ మూడు నెలల్లోనే మరో 11 వేల కోట్లు రాబట్టుకోవాల్సి ఉన్నది. ఇతర ట్యాక్స్​లు, డ్యూటీలు కూడా రూ.10,111 కోట్లు అంచనా వేస్తే అందులో సగమే వచ్చాయి. 

అప్పుల వడ్డీలకే రూ. 20 వేల కోట్లు.. 

కాగ్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న అప్పుల వడ్డీల చెల్లింపులకు ఈ 9 నెలల్లో రూ.19,556.61 కోట్లు చెల్లించినట్టు వెల్లడైంది. ఇక ఉద్యోగుల జీతాలకు రూ. 31,584.35 కోట్లు, పెన్షన్లకు రూ. 12,585.37 కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది. అలాగే వివిధ సంక్షేమ పథకాల్లో సబ్సిడీలకు సంబంధించి రూ.9,701.50 కోట్లు చెల్లించినట్టు కాగ్ పేర్కొంది.