9 లక్షల ఇండ్లు ఇవ్వండి .. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్

9 లక్షల ఇండ్లు ఇవ్వండి .. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్
  •  
  • సెప్టెంబర్ మొదటివారంలో ఇండ్లు శాంక్షన్ చేయనున్న కేంద్రం 
  • సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా తెలంగాణకు ఈ ఏడాది 9 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు ప్రపోజల్ పెట్టింది. ఇదివరకే పలుసార్లు ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ప్రధాని మోదీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మీటింగ్ లోనూ రాష్ర్ట హౌసింగ్ అధికారులు పాల్గొని మరోసారి ప్రతిపాదనలు అందించారు. ఇందులో అర్బన్ లో 6.5 లక్షలు, రూరల్ లో 2.5 లక్షల ఇండ్లు ఇవ్వాలని కోరారు. పీఎం ఆవాస్ కింద అర్బన్ లో ఒక్కో ఇంటికి కేంద్రం రూ.1.50 లక్షలు, రూరల్ లో రూ.72 వేలు ఆర్థిక సహాయం అందచేస్తుంది. మిగతా నిధులను రాష్ర్ట ప్రభుత్వం భరించి పేదలకు ఇందిరమ్మ స్కీమ్ లో భాగంగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయనుంది. అయితే, వచ్చే నెల మొదటి వారంలోనే కేంద్రం నుంచి పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు కానున్నాయని, వీటిలో రాష్ట్రానికి దాదాపు 5.5 లక్షల ఇండ్లు శాంక్షన్ కావచ్చని హౌసింగ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్లకు వచ్చిన అప్లికేషన్లను గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా వెరిఫికేషన్ చేయించి, గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక చేస్తామని, ఈ అంశంపై సీఎం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పీఎం ఆవాస్ యోజన బకాయిలను కూడా మూడు దశల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం శాంక్షన్ చేసిందన్నారు. 

55 లక్షల అప్లికేషన్లు.. 

ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్లకు మొత్తం 80 లక్షల అప్లికేషన్లు రాగా.. వీటిలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిని తొలగించగా, 55 లక్షల అప్లికేషన్లు ఉన్నాయన్నారు. బీపీఎల్ కేటగిరీ, ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అప్లికేషన్లు ఫిల్టర్ చేసి గ్రామ సభ ద్వారా లబ్ధిదారుల ఎంపిక, తరువాత ఎమ్మెల్యే, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ద్వారా ఫైనల్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేస్తుందని ఆ అధికారి తెలిపారు. తొలి దశలో సొంత ఇంటి జాగా ఉండి ఇండ్లు లేనివారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తరువాత దశలో జాగా కొనేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఈ ఏడాదిలో మొత్తం 4.5 లక్షల ఇండ్లకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు.